Aloo Gobi Masala Curry : మనం క్యాలీప్లవర్ తో ఎక్కువగా చేసే వంటకాల్లో ఆలూ గోబి మసాలా కూర కూడా ఒకటి. క్యాలీప్లవర్, బంగాళాదుంపలు కలిపి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ కూరను అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ కూరను తయారు చేయడం కూడా చాలా తేలిక. ఈ ఆలూ గోబి మసాలా కూరను మనం మరింత రుచిగా ధాబాల్లో లభించే విధంగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ గోబి మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన బంగాళాదుంపలు – 200 గ్రా., పెద్ద ముక్కలుగా తరిగిన క్యాలీప్లవర్ – 1 ( చిన్నది), నూనె – 3 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, గరం మసాలా – అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, పెద్ద టమాటాలు – 3, నీళ్లు – 150 ఎమ్ ఎల్, బటర్ – 2 టీ స్పూన్, క్రీమ్ – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్.
ఆలూ గోబి మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో రెండు లీటర్ల నీటిని తీసుకుని వేడి చేయాలి. ఇందులో పసుపు, బంగాళాదుంప ముక్కలు వేసి కలపాలి. తరువాత వీటిని 80 శాతం వరకు మెత్తగా ఉడికించాలి. తరువాత వీటిని తీసి పక్కకు ఉంచాలి. ఇప్పుడు అదే నీటిలో క్యాలీప్లవర్ ముక్కలు వేసి ఉడికించాలి. ఈ ముక్కలను కూడా 80 శాతం వరకు ఉడికించి ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, పసుపు వేసి కలపాలి.
వీటిని ఒక నిమిషం పాటు వేయించుకున్న తరువాత టమాటాలను పేస్ట్ గా చేసి వేసుకుని అంతా కలిసేలా కలపాలి. తరువాత ఈ పేస్ట్ ను నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. తరువాత ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, క్యాలీప్లవర్ ముక్కలు వేసి కలపాలి. తరువాత ఈ ముక్కలను పూర్తిగా మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత బటర్, క్రీమ్ వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించిన తరువాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ గోబి మసాలా కర్రీ తయారవుతుంది. చపాతీ, పూరీ, రోటి, పుల్కా వంటి వాటితో కలిపి తింటే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ కూరను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.