Aloo Kofta Curry : మనకు రెస్టారెంట్ లలో, క్యాటరింగ్ లో లభించే వివిధ రకాల వంటకాల్లో ఆలూ కోఫ్తా కర్రీ కడా ఒకటి. ఆలూ కోఫ్తా కర్రీ కూడా ఒకటి. బంగాళాదుంపలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఇది ఒకటి. కోఫ్తా కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దేనితో తిన్నా కూడా ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ కోఫ్తా కర్రీని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎంతో రుచిగా ఉండే ఆలూ కోఫ్తా కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ కోఫ్తా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన బంగాళాదుంపలు – 2, టమాట ఫ్యూరీ – ఒక కప్పు, చిన్న ముక్కలుగా తరిగిన క్యాప్సికం – 1, తురిమిన క్యారెట్ – 1, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – 2, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, పెరుగు – అర కప్పు, బ్రెడ్ క్రంబ్స్ – అర కప్పు, మైదా పిండి – అర కప్పు, జీడిపప్పు – 20 గ్రా., ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 3, యాలకులు – 3, గరం మసాలా – ఒక టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఆలూ కోఫ్తా కర్రీ తయారీ విధానం..
ముందుగా బంగాళాదుంపలను ఉండలు లేకుండా తురుముకోవాలి. తరువాత ఇందులో మైదాపిండి, బ్రెడ్ క్రంబ్స్, అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టేబుల్ స్పూన్ గరం మసాలా, కారం, ఉప్పు, అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి తురుము, క్యారెట్ తురుము, క్యాప్సికం తరుగు, కొత్తిమీర వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. తరువాత చేతికి నూనె రాసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక ఒక్కో ఉండను వేసి ఫ్రై చేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత వాటిని జార్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులోనే పెరుగును కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత అదే కళాయిలో మరో టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మసాలా దినుసులు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత టమాట ఫ్యూరీ వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి వేసి కలపాలి.
దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత ఒక గ్లాస్ నీళ్లు పోసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కూరను కోఫ్తా బాల్స్ మీద వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే ఆలూ కోఫ్తా కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, పులావ్, చపాతీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. బంగాళాదుంపలతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా కోఫ్తా కర్రీని కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఈ కర్రీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.