Aloo Masala Fry : బంగాళాదుంపతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. బంగాళాదుంపలను మం విరివిరిగా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బంగాళాదుంపలను తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి6, మెగ్నీషియం, కాపర్ వంటి పోషకాలు అనేకం ఉంటాయి. బీపీ ని నియంత్రించడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో బంగాళాదుంపలు మనకు ఎంతగానో దోహదపడతాయి. ఈ బంగాళాదుంపలతో ఎక్కువగా వేపుడును చేసుకుని తింటూ ఉంటాం. ఈ వేపుడును మరింత రుచిగా అందరూ ఇష్టపడేలా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ మసాలా ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్నగా తరిగిన బంగాళాదుంపలు – అరకిలో, తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, చిన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు – 4, పదినిమిషాల పాటు నానబెట్టిన ఎండుమిర్చి – 5, గరం మసాలా – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, కరివేపాకు – 2 రెబ్బలు.
ఆలూ మసాలా ఫ్రై తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో ఒక లీటర్ నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు మరిగిన తరువాత రెండు సార్లు నీటిలో కడిగిన బంగాళాదుంప ముక్కలను వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై 10 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత నీరు అంతా పోయేలా వడకట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత జార్ లో నానబెట్టిన ఎండుమిర్చి, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి నూనె వేడయ్యాక ఉడికించిన బంగాళాదుంప ముక్కలను వేసి మధ్యస్థ మంటపై వేయించుకోవాలి. వీటిని ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి.
ఇవి వేగిన తరువాత మిక్సీ పట్టుకున్న ఎండుమిర్చి పేస్ట్ వేసి నూనె పైకి తేలే వరకు బాగా వేయించాలి.ఇలా వేయించిన తరువాత అందులో ఉప్పు, గరం మసాలా వేసి కలపాలి. తరువాత వేయించిన బంగాళాదుంప ముక్కలు వేసి రెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ మసాలా ఫ్రై తయారవుతుంది. దీనిని పప్పు, సాంబార్, రసం వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. బంగాళాదుంపలతో తరచూ చేసే వంటకాలతో పాటు ఇలా అప్పుడప్పుడూ పైన చెప్పిన విధంగా మసాలా ఫ్రైను కూడా తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఇష్టంగా తింటారు.