Aloo Snacks : మనం బంగాళాదుంపలతో రకరకాల కూరలను, చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంపలతో చేసే కూరలే కాకుండా వాటితో చేసే చిరుతిళ్లు కూడా చాలా రుచిగా ఉంటాయి. బంగాళాదుంపలతో చేసిన చిరుతిళ్లను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. బంగాళాదుంపలతో కింద చెప్పిన విధంగా చేసే వంటకం కూడా చాలా రుచిగా ఉంటుంది. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా తినడానికి ఈ వంటకం చాలా చక్కగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. సాయంత్రం సమయాల్లో తినడానికి చక్కగా ఉండే ఈ వంటకాన్ని ఏవిధంగా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ స్నాక్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదా పిండి – ఒక కప్పు, గోధుమపిండి – ఒక కప్పు, ఉప్పు – తగినంత, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ – అర టీ స్పూన్, వాము – అర టీ స్పూన్, నెయ్యి – 2 టీ స్పూన్స్, చిన్నగా తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
స్టఫింగ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – పావు టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ – 1, కారం – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, ధనియాల పొడి – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్, చాట్ మసాలా – పావు టీ స్పూన్, ఉడికించిన బంగాళాదుంపలు – 3, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఆలూ స్నాక్స్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండిని, మైదాపిండిని తీసుకోవాలి. తరువాత నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని చపాతీ పిండిలా మెత్తగా కలపాలి. తరువాత దీనిపై మూతను పెట్టి పక్కకు ఉంచాలి. తరువాత ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. తరువాత ఉడికించిన బంగాళాదుంపలను మెత్తగా చేసి వేసుకోవాలి.
తరువాత అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించిన తరువాత కొత్తిమీర, పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారే వరకు ఉంచాలి. తరువాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మరోసారి కలిపి చిన్న పరిమాణంలో ఉండలుగా చేసుకోవాలి. తరువాత వీటిని పొడి పిండి చల్లుకుంటూ చతురస్రాకారంలో చపాతీలా రుద్దుకోవాలి. తరువాత ఈ చపాతీపై మధ్యలో ముందుగా తయారు చేసుకున్న బంగాళాదుంప మిశ్రమాన్ని తగినంత ఉంచాలి. తరువాత చపాతీ అంచులకు నీటితో తడి చేయాలి. తరువాత చపాతీని మధ్యలోకి మడిచి అంచులు గట్టిగా అత్తుకునేలా వత్తుకోవాలి.
ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ముందుగా తయారు చేసుకున్న వాటిని నూనెలో వేసి కాల్చుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ స్నాక్స్ తయారవుతాయి. వీటిని టమాట కిచప్ తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు వీటిని మరింత ఇష్టంగా తింటారు. నోటికి ఏదైనా రుచిగా తినాలనిపించినప్పుడు ఇలా బంగాళాదుంపలతో ఈ వంటకాన్ని తయారు చేసుకుని తినవచ్చు.