Karam Gulabilu : మనకు స్వీట్ షాపుల్లో లభించే పదార్థాల్లో గులాబి పువ్వులు కూడా ఒకటి. ఇవి కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. మనకు తీపి, కారం రెండు రుచుల్లో ఇవి లభిస్తాయి. కారం గులాబి పువ్వులు కూడా చాలా రుచిగా ఉంటాయి. గులాబి పువ్వుల గుత్తి ఉండాలే కానీ వీటిని తయారు చేయడం చాలా తేలిక. అందరూ ఎంతో ఇష్టంగా తినే కారం గులాబీలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కారం గులాబీల తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం పిండి – ఒక గ్లాస్, మైదాపిండి – అర గ్లాస్, శనగపిండి – ఒక గ్లాస్, ఉప్పు – తగినంత, నువ్వులు – ఒక టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్ లేదా తగినంత, నీళ్లు – రెండు గ్లాసులు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
కారం గులాబీల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బియ్యం పిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో మైదా, శనగపిండి, ఉప్పు, కారం, నువ్వులు వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. అలాగే పిండి మరీ పలుచగా, మరీ చిక్కగా కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. ఈ నూనెలోనే గులాబి పువ్వుల గుత్తిని కూడా వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఈ గుత్తిని ముప్పావు వంతు వరకు పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి. ఇది కొద్దిగా కాలిన తరువాత పిండి దానంతట అదే గుత్తి నుండి వేరవుతుంది లేదా చాకుతో నెమ్మదిగా వేరు చేసుకోవాలి.
ఈ గులాబి పువ్వులను మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కారం గులాబీలు తయారవుతాయి. ఈ గులాబీ పువ్వులు తయారు చేసే గుత్తిని నూనెలో ఉంచి ఎప్పుడూ వేడిగా ఉండేలా చూసుకోవాలి. ఇలా గులాబి పువ్వులు అత్తుకు పోకుండా ఉంటాయి. ఈ విధంగా చేసిన కారం గులాబీలు చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఈ కారం గులాబీలను కూడా అందరూ ఇష్టంగా తింటారు.