Apple Halwa : సాధారణంగా మనం యాపిల్ పండ్లను నేరుగా తరచూ తింటుంటాం. ఒక యాపిల్ పండును రోజుకు ఒకటి చొప్పున తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదు.. అనే మాటను కూడా మనం తరచూ వింటుంటాం. అయితే యాపిల్ పండ్లను నేరుగా అలాగే తినడంతోపాటు వాటితో హల్వాను కూడా తయారు చేసి తినవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
యాపిల్ పండ్లతో హల్వా తయారీకి కావల్సిన పదార్థాలు..
యాపిల్స్ – నాలుగు, నెయ్యి – నాలుగు టీస్పూన్లు, జీడిపప్పు పలుకులు – 8, చక్కెర – పావు కప్పు, కేసరి రంగు, యాలకుల పొడి – పావు టీస్పూన్, వెనిలా ఎక్స్‌ట్రాక్ట్ – ఒక టీస్పూన్.
యాపిల్ పండ్ల హల్వాను తయారు చేసే విధానం..
యాపిల్ పండ్లను బాగా తురుముకోవాలి. ఒక పాన్ తీసుకుని అందులో నెయ్యి వేసి వేడయ్యాక జీడిపప్పు పలుకులను వేసి వేయించాలి. తరువాత వాటిని పక్కన పెట్టాలి. మిగిలిన నెయ్యిలో యాపిల్ తురుమును వేసి మెత్తగా అయ్యేవరకు వేయించాలి. ఆ తరువాత చక్కెర, కేసరి వేసి బాగా కలపాలి. చక్కెరంతా కరిగి హల్వా అంతా దగ్గరయ్యాక వెనీలా ఎక్స్‌ట్రాక్ట్, యాలకుల పొడి, జీడిపప్పు పలుకులు కలిపితే యాపిల్ హల్వా రెడీ. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.