Aratikaya Pesara Punukulu : మనం పచ్చి అరటికాయలతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. అరటికాయలతో చేసే వంటకాలను తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. పచ్చి అరటికాయలను తీసుకోవడం వల్ల కూడా మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వీటితో ఎక్కువగా చిప్స్ ను, కూరను తయారు చేస్తూ ఉంటారు. ఇవే కాకుండా పచ్చి అరటికాయతో మనం ఎంతో రుచిగా ఉండే పునుగులను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పునుగులను తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ పునుగులను తయారు చేయడం చాలా సులభం. పచ్చి అరటికాయలతో పునుగులను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అరటికాయ పెసర పునుగుల తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన పచ్చి అరటికాయలు – 2, నానబెట్టిన పెసరపప్పు – పావు కప్పు, బియ్యం పిండి – 2 టీ స్పూన్స్, ఉప్పు- తగినంత, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 3, దంచిన ధనియాలు – పావు టీ స్పూన్, తరిగిన కొత్తిమీర- కొద్దిగా, కారం – అర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 2, నూనె – 2 టీ స్పూన్స్.
అరటికాయ పెసర పునుగుల తయారీ విధానం..
ముందుగా ఉడికించిన అరటికాయలను పొట్టు తీసేసి మెత్తగా చేసుకోవాలి. తరువాత పెసరపప్పును పేస్ట్ లాగా చేసుకుని అరటికాయ మిశ్రమంలో వేసి కలపాలి. తరువాత మిగిలిన పదార్థాలన్ని వేసి కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇలా పిండిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో డీప్ ఫ్రైకు సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ పునుగుల్లా వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే అరటికాయ పెసర పునుగులు తయారవుతాయి. వీటిని అల్లం చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. అరటికాయలతో తరచూ చేసే వంటకాలతో పాటు ఇలా పునుగులను కూడా తయారు చేసుకుని తినవచ్చు. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.