Atukula Vada : మనం ఆహారంగా అప్పుడప్పుడూ అటుకులను కూడా తీసుకుంటూ ఉంటాం. వడ్లతో ఈ అటుకులను తయారు చేస్తారు. కనుక ఇవి కూడా మన శరీరానికి మేలు చేస్తాయి. అటుకులతో మనం ఎక్కువగా మిక్చర్, పోహా, పాయసం వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా మనం అటుకులతో ఎంతో రుచిగా ఉండే వడలను కూడా తయారు చేసుకుని తినవచ్చు. అటుకుల వడలు వేడిగా ఉన్నప్పుడే తింటే చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. అటుకులతో వడలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అటుకుల వడ తయారీకి కావల్సిన పదార్థాలు..
లావుగా ఉండే అటుకులు – 2 కప్పులు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 4, చిన్నగా తరిగిన అల్లం ముక్కలు – ఒక టేబుల్ స్పూన్, తరిగిన కరివేపాకు – ఒక రెబ్బ, తరిగిన కరివేపాకు – కొద్దిగా, ఉప్పు – తగినంత, శనగపిండి – 2 టేబుల్ స్పూన్స్, బియ్యం పిండి – ఒక టేబుల్ స్పూన్, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా, పసుపు – చిటికెడు, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్.
అటుకుల వడ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో అటుకులను తీసుకుని వాటిని శుభ్రంగా కడగాలి. తరువాత అటుకులు మునిగే వరకు నీటిని పోసి 10 నిమిషాల పాటు నానబెట్టాలి. తరువాత ఈ అటుకులను చేత్తో పిండుతూ నీరు అంతా పోయేలా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ విధంగా మెత్తగా అయ్యేలా చేసుకున్న అటుకుల్లో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి అవసరమైతే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల నీళ్లను వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. తరువాత ఈ అటుకుల మిశ్రమాన్ని తగిన మోతాదులో తీసుకుంటూ వడల ఆకారంలో వత్తుకుంటూ ప్లేట్ లో పెట్టుకోవాలి.
తరువాత కళాయిలో నూనె పోసి నూనె కాగిన తరువాత వడలను వేసి కాల్చుకోవాలి. ఈ అటుకుల వడలను మధ్యస్థ మంటపై తిప్పుతూ రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని టిష్యూ పేపర్ ఉంచిన గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే అటుకుల వడలు తయారవుతాయి. ఈ అటుకుల వడలను నేరుగా లేదా టమటా కెచప్ తో కలిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. అటుకులతో తరచూ చేసే పదార్థాలకు బదులుగా ఇలా అప్పుడప్పుడూ వడలను కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఈ విధంగా చేసిన అటుకుల వడలను అందరూ ఆహా అనుకుంటూ తినాల్సిందే.