Avakaya : మనలో చాలా మంది వేసవి రాగానే సంవత్సరానికి సరిపడా ఆవకాయను తయారు చేసుకుని నిల్వ చేసుకుంటూ ఉంటారు. ఆవకాయ పచ్చడికి ఉండే రుచి అంతా ఇంతా కాదు. ఆవకాయ తయారీలో ఉపయోగించే పచ్చి మామిడి కాయ మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. షుగర్ , బీపీలను నియంత్రించడంలో పచ్చి మామిడి కాయ ఎంతో సహాయపడుతుంది. అజీర్తిని, దంత సమస్యలను తగ్గించడంలో కూడా పచ్చి మామిడి కాయలు ఉపయోగపడతాయి. ఆవకాయను చాలా సులువుగా, రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆవకాయ తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చి మామిడి కాయలు – 4 (పెద్దవి), ఆవాలు – ఒక కప్పు, కారం – ఒక కప్పు, ఉప్పు – ఒక కప్పు కంటే కొద్దిగా తక్కువ, నువ్వుల నూనె – ఒకటిన్నర కప్పు.
ఆవకాయ తయారీ విధానం..
ముందుగా మామిడి కాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా చేసుకోవాలి. తరువాత కావల్సిన పరిమాణంలో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక జార్ లో ఆవాలను వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత ఒక పెద్ద ప్లేట్ లో కానీ గిన్నెలో కానీ ఆవాల పొడి, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వాటిలోనే అర కప్పు నువ్వుల నూనె వేసి కలుపుకోవాలి. తరువాత మామిడి కాయ ముక్కలను వేసి ఉప్పు, కారం అంతా ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. తరువాత డబ్బాలో ముందుగా అర కప్పు నువ్వల నూనెను పోయాలి. తరువాత ఉప్పు, కారం, ఆవాల పొడి వేసి కలిపి పెట్టుకున్న మామిడి కాయ ముక్కలను వేయాలి. ఇలా వేసుకున్న మామిడి కాయ ముక్కలపై మరో అర కప్పు నువ్వుల నూనెను పోయాలి. ఇప్పుడు డబ్బా మూత పెట్టి ఒక రోజంతా ఉంచాలి. తరువాత మూత తీసి పచ్చడిని అంతా మరోసారి బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆవకాయ తయారవుతుంది. ఇందులో ఒకటిన్నర కప్పు కంటే కూడా నూనెను ఎక్కువగా లేదా తక్కువగా కూడా వేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న పచ్చడి చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి, ఆవకాయను వేసి కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అంతే కాకుండా పచ్చి మామిడి కాయ, ఆవాల వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు.