Badam Kulfi : మనకు వేసవి కాలంలో ఎక్కువగా లభించే పదార్థాల్లో కుల్ఫీలు కూడా ఒకటి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. వీటిని తినడం వల్ల రుచితో పాటు ఎండ నుండి ఉపశమనాన్ని కూడా పొందవచ్చు. మనకు వివిధ రుచుల్లో ఈ కుల్ఫీలు లభిస్తూ ఉంటాయి. వాటిలో బాదం కుల్ఫీ కూడా ఒకటి. బాదం ప్లేవర్ తో ఈ కుల్ఫీ చాలా రుచిగా ఉంటుంది. బయట కొనుగోలు చేసే పని లేకుండా ఈ బాదం కుల్పీలను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా సులభం. చల్ల చల్లగా రుచిగా బాదం కుల్ఫీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బాదం కుల్ఫీ తయారీకి కావల్సిన పదార్థాలు..
బాదంపప్పు – 12, చిక్కటి పాలు – అర లీటర్, యాలకులు – 4, కస్టర్డ్ పౌడర్ – ఒక టేబుల్ స్పూన్, కుంకుమ పువ్వు – చిటికెడు, చిన్నగా తరిగిన బాదం పలుకులు – కొద్దిగా, పంచదార – 3 టేబుల్ స్పూన్స్.
బాదం కుల్ఫీ తయారీ విధానం..
ముందుగా బాదంపప్పును నీటిలో వేసి 4 గంటల పాటు నానబెట్టాలి. తరువాత వీటిపై ఉండే పొట్టును తీసి జార్ లో వేసుకోవాలి. ఇందులోనే యాలకులు, ఒక టేబుల్ స్పూన్ పాలు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అలాగే కస్టర్డ్ పౌడర్ లో కూడా నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో పాలు పోసి ఒక పొంగు వచ్చే వరకు మరిగించాలి. తరువాత బాదం పేస్ట్, కస్టర్డ్ పౌడర్ వేసి కలపాలి. వీటిని ఉండలు లేకుండా 4 నిమిషాల పాటు కలిపిన తరువాత కుంకుమ పువ్వు, పంచదార, బాదం పలుకులు వేసి కలపాలి. వీటిని మరో 4 నుండి 5 నిమిషాల పాటు కలుపుతూ మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
తరువాత వీటిపై మీగడ పేరుకుపోకుండా కలుపుతూ పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత ఈ మిశ్రమాన్ని కుల్ఫీ మౌల్డ్స్ లో లేదా టీ గ్లాసులో పోసుకోవాలి. తరువాత వీటిపై సిల్వర్ పాయిల్ ను ఉంచిసీల్ చేసుకోవాలి. వీటిని ఒక రాత్రంతా డీ ఫ్రిజ్ లో ఉంచాలి. తరువాత వీటిని బయటకు తీసి డీ మౌల్డ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బాదం కుల్ఫీలు తయారవుతాయి. వీటిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా ఇంట్లోనే చాలా సులభంగా చల్ల చల్లగా రుచిగా బాదం కుల్ఫీలను తయారు చేసుకుని తినవచ్చు.