Banana Protein Shake : మనలో చాలా మంది ఇష్టంగా తినే పండ్లల్లో అరటి పండు ఒకటి. చాలా తక్కువ ధరలో అన్నీ కాలాల్లో విరివిరిగా లభించే పండ్లల్లో ఇది ఒకటి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ దీనిని ఇష్టంగా తింటారు. అరటి పండును తినడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు ఎన్నో లభిస్తాయి. దీనిని తినడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో, జీర్ణ శక్తిని మెరుగుపరచడంలో, ఒత్తిడిని ఆందోళనను తగ్గించడంలో అరటి పండు మనకు ఎంతో దోహదపడుతుంది. అలాగే అరటి పండును తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కడుపులో అల్సర్లను తగ్గించడంలో, మెదడు పనితీరును మెరుగుపరచడంలో కూడా అరటి పండు సహాయపడుతుంది. వీటిని నేరుగా తినడంతో పాటు ఫ్రూట్ సలాడ్స్, ప్రోటీన్ షేక్స్ వంటి వాటిని కూడా తయారు చేస్తూ ఉంటారు. అరటి పండుతో చేసే ప్రోటీన్ షేక్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తాగడం వల్ల శరీరానికి కావల్సిన ప్రోటీన్స్ అన్నీ లభిస్తాయి. బరువు పెరగాలనుకునే వారు, శరీర ఆకృతి కోసం వ్యాయామాలు చేసే వారు ఈ ప్రోటీన్ షేక్ ను తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అరటిపండుతో రుచిగా, ఆరోగ్యానికి మరింత మేలు చేసేలా తరచూ చేసే దాని కంటే భిన్నంగా ప్రోటీన్ షేక్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రోటీన్ షేక్ ను తయారు చేసుకోవడానికి గానూ మనం 2 టీ స్పూన్ల కాబూలీ శనగలు, 2 టీ స్పూన్ల పల్లీలు, ఒక అరటిపండు, అర కప్పు పాలను, ఒక టీ స్పూన్ చియా విత్తనాలను ఉపయోగించాల్సి ఉంటుంది.
ముందుగా శనగలను, పల్లీలపు 12 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. ఇలా చక్కగా నానబెట్టిన తరువాత వీటిని నీళ్లు లేకుండా ఒక జార్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులోనే అర కప్పు పాలు, ఒక అరటి పండు వేసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ఒక గ్లాస్ లోకి తీసుకుని తగినన్ని నీళ్లు కలుపుకోవాలి. తరువాత ఇందులో చియా విత్తనాలను వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, ఆరోగ్యానికి మరింత మేలు చేసే అరటి పండు ప్రోటీన్ షేక్ తయారవుతుంది. దీనిలో సబ్జా గింజలను కూడా వేసుకోవచ్చు. అలాగే ఈ ప్రోటీన్ షేక్ ను ఎవరైనా తాగవచ్చు. ఈ ప్రోటీన్ షేక్ ను ఉదయం పూట అల్పాహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. బరువు పెరగాలనుకునే వారు ఈ ప్రోటీన్ షేక్ ను తాగడం వల్ల ఆరోగ్యంగా బరువు పెరగవచ్చు. అరటి పండుతో ఈ విధంగా ప్రోటీన్ షేక్ ను తయారు చేసుకుని తాగడం వల్ల రుచితో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.