Vankaya Pappu Pulusu : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో వంకాయలు ఒకటి. వంకాయలతో చేసిన కూరలను తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. వంకాయలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. ఈ వంకాయలతో మనం ఎంతో రుచిగా ఉండే పప్పు పులుసును కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పులుసు కూరను పాతకాలంలో ఎక్కువగా తయారు చేసే వారు. వంకాయలతో చేసే ఈ పప్పు పులుసు కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. వంటరాని వారు, మొదటి సారి చేసే వారు కూడా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. వంకాయలతో పప్పు పులుసు కూరను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వంకాయ పప్పు పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్న ముక్కలుగా తరిగిన వంకాయలు – పావు కిలో, కందిపప్పు – ఒకటిన్నర టీ గ్లాస్, పెద్ద ముక్కలుగా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 4, నానబెట్టిన చింతపండు – పెద్ద నిమ్మకాయంత, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, బెల్లం – ఒక చిన్న ముక్క.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ.
వంకాయ పప్పు పులుసు తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో కందిపప్పును తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి పప్పును ఉడికించుకోవాలి. ఇందులోనే పసుపును వేసి పప్పును సగానికి పైగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తరువాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వంకాయ ముక్కలు, తగినన్ని నీళ్లు పోసి వంకాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తరువాత ఉప్పు, కారం, బెల్లం, చింతపండు రసం వేసి కలపాలి. ఈ పప్పు పులుసు మరీ చిక్కగా మరీ పలుచగా కాకుండా తగినన్ని నీళ్లు పోసుకుని 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత ముందుగా ఉడికించుకున్న పప్పు పులుసును వేసి మరో నిమిషం పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ పప్పు పులుసు కూర తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కూరను మనం కుక్కర్ లో వేసి కూడా చేసుకోవచ్చు. కుక్కర్ లో కందిపప్పు, వంకాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, నీళ్లు పోసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా ఎంతో రుచిగా ఉండే వంకాయ పప్పు పులుసు తయారవుతుంది. వంకాయలతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఈ పప్పు పులుసు కూరను లొట్టలేసుకుంటూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.