Bellam Sunnundalu Recipe : మినపప్పును కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఈ పప్పులో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. మినపప్పుతో మనం ఎక్కువగా అల్పాహారాలను తయారు చేస్తూ ఉంటాం. అల్పాహారాలే కాకుండా మినపప్పుతో మనం ఇతర వంటకాలను కూడా తయారు చేయవచ్చు. మినపప్పుతో చేసే ఇతర రుచికరమైన వంటకాల్లో బెల్లం సున్నుండలు కూడా ఒకటి. వీటిని మనలో చాలా మంది తినే ఉంటారు. సున్నుండలు ఎంతో బలవర్ధకమైన ఆహారంగా చెప్పవచ్చు. వీటిని తయారు చేసుకుని తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. మన శరీరానికి కావల్సినంత బలాన్ని చేకూర్చే ఈ బెల్లం సున్నుండలను రుచిగా, చక్కగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బెల్లం సున్నుండల తయారీకి కావల్సిన పదార్థాలు..
మినపప్పు – 2 కప్పులు, బియ్యం – 2 టేబుల్ స్పూన్స్, బెల్లం తురుము – ఒకటిన్నర కప్పు లేదా రెండు కప్పులు, యాలకుల పొడి – అర టీ స్పూన్, కరిగించిన నెయ్యి – తగినంత.
బెల్లం సున్నుండల తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో మినపప్పుపను, బియాన్ని వేసి మధ్యస్థ మంటపై కలుపుతూ వేయించాలి. మినపప్పు వేగి చక్కటి వాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లగా అయ్యే వరకు ఉంచాలి. తరువాత ఈ మినపప్పును ఒక జార్ లోకి తీసుకుని మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో బెల్లం తురుము వేసి వేడి చేయాలి. ఈ బెల్లాన్ని ఉండలు లేకుండా కలుపుతూ బెల్లం పూర్తిగా కరిగే వరకు వేడి చేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ బెల్లాన్ని మిక్సీ పట్టుకున్న మినపప్పు మిశ్రమంలో వేసి అంతా కలిసేలా బాగా కలపాలి.
తరువాత తగినంత నెయ్యిని వేస్తూ తగిన పరిమాణంలో మినపప్పు బెల్లం మిశ్రమాన్ని తీసుకుంటూ ఉండలుగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెల్లం సున్నుండలు తయారవుతాయి. వీటిని కేవలం మినపప్పుతోనే కాకుండా మినపగుళ్లు, పొట్టు మినపప్పుతో కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా కూడా ఆహారంగా తీసుకోవచ్చు. రోజుకు ఒక సున్నుండను తినడం వల్ల శరీరం పుష్టిగా, బలంగా తయారవుతుంది.