Bendakaya Majjiga Charu : మనం పెరుగుతో మజ్జిగ చారును తయారు చేసుకుని తింటూ ఉంటాం. మజ్జిగ చారు చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. చాలా మంది ఈ మజ్జిగ చారును ఇష్టంగా తింటారు. తరచూ చేసే ఈ మజ్జిగ చారును బెండకాయలు వేసి మనం మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. బెండకాయలు వేసి చేసే ఈ మజ్జిగ కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. బెండకాయ మజ్జిగ చారును ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బెండకాయ మజ్జిగ చారు తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన బెండకాయలు – 10, చిలికిన పెరుగు – ఒక కప్పు, నీళ్లు – ఒక కప్పు, పెద్ద ముక్కలుగా తరిగిన ఉల్లిపాయ – 1, వెల్లుల్లి రెబ్బలు – 3, పచ్చిమిర్చి – 2, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, పచ్చి కొబ్బరి ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, నూనె – ఒక టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, ఎండుమిర్చి – 1, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
బెండకాయ మజ్జిగ చారు తయారీ విధానం..
ముందుగా ఒ గిన్నెలో చిలికిన పెరుగును తీసుకుని అందులో నీళ్లు పోసి కలిపి పెట్టుకోవాలి. తరువాత ఒక జార్ లో పెద్దగా తరిగిన ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర పొడి, పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత బెండకాయ ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్, పసుపు, ఉప్పు వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, ముందుగా తయారు చేసుకున్న పెరుగు వేసి కలపాలి. ఈ విధంగా తయారు చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెండకాయ మజ్జిగ తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే మజ్జిగ చారు కంటే ఈ విధంగా బెండకాయలు వేసి చేసిన మజ్జిగ చారు మరింత రుచిగా ఉంటుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.