Bendakaya Pachadi : మనం బెండకాయలతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. బెండకాయలతో చేసే కూరలను తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. బెండకాయలతో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. బెండకాయలతో మనం ఎక్కువగా వేపుడు, కూరలు, పులుసు వంటి వాటినే తయారు చేస్తూ ఉంటాం. కానీ వీటితో మనం ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. బెండకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా సులభం. ఎంతో రుచిగా ఉండే బెండకాయ గుజ్జు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బెండకాయ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
బెండకాయలు – 15, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, ఎండుమిర్చి – 10, నానబెట్టిన చింతపండు – పెద్ద నిమ్మకాయంత, ఉప్పు- తగినంత, నూనె – ఒక టీ స్పూన్.
బెండకాయ పచ్చడి తయారీ విధానం..
ముందుగా బెండకాయలను ఆవిరి మీద మెత్తగా ఉడికించాలి. తరువాత వాటి తొడిమలను తీసి పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఎండుమిర్చి వేసి వేయించాలి. ఎండుమిర్చి చక్కగా వేగిన తరువాత వాటిని జార్ లోకి తీసుకుని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఉడికించిన బెండకాయలు, ఉప్పు, మిక్సీ పట్టుకున్న ఎండుమిర్చి వేసి బెండకాయలను నలుపుతూ కలుపుకోవాలి. తరువాత చింతపండు రసం, ఉల్లిపాయ ముక్కలు వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెండకాయ పచ్చడి తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. బెండకాయలతో చేసే ఇతర వంటకాల కంటే ఈ విధంగా చేసే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది.