Bendakaya Vellulli Karam Fry : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో బెండకాయ కూడా ఒకటి. బెండకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. బెండకాయలతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బెండకాయలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో బెండకాయ వేపుడు కూడా ఒకటి. బెండకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. ఈ బెండకాయ వేపుడును మనం వెల్లుల్లి కారం వేసి మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. బెండకాయను తినని వారు కూడా ఈ వేపుడును ఇష్టంగా తింటారు. ఎంతో రుచిగా ఉండే బెండకాయ వెల్లుల్లి కారాన్ని ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బెండకాయ వెల్లుల్లి కారం తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన బెండకాయలు – పావుకిలో, కారం – ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 6, ఎండు కొబ్బరి ముక్క – రెండు ఇంచుల ముక్క, ఉప్పు – తగినంత, నూనె – 2 టేబుల్ స్పూన్స్.
బెండకాయ వెల్లుల్లి కారం తయారీ విధానం..
ముందుగా బెండకాయలను తరిగి వస్త్రంపై వేసి ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి. తరువాత ఒక జార్ లో ఎండు కొబ్బరి ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కారం వేసి బరకగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బెండకాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై కలుపుతూ వేయించాలి. బెండకాయ ముక్కలు పూర్తిగా వేగిన తరువాత మిక్సీ పట్టుకున్న కారం వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత మరో రెండు నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెండకాయ వెల్లుల్లి కారం తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే బెండకాయ ఫ్రై కంటే ఈవిధంగా చేసిన బెండకాయ ఫ్రై మరింత రుచిగా ఉంటుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.