సాధారణంగా యమున్ని చావుకి ప్రతిరూపంగా భావిస్తారు. అందువల్లే యమధర్మరాజుకు చాలా దూరంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇంతమంది దేవుళ్లకు ఆలయాలున్నాయి కానీ యమధర్మరాజుకి మాత్రం ఒకే ఒక ఆలయం.. అది కూడా హిమాలయాల్లో ఉంది. మనిషి చనిపోయిన తర్వాత శరీరాన్ని వదిలి ఆత్మ పరలోకం చేరుతుందని కొందరి నమ్మకం. జీవించినప్పుడు చేసిన పాప పుణ్యాలను అనుసరించి సదరు జీవి పరలోకంలో శిక్షను అనుభవిస్తాడని చెబుతారు. ఏ భేదం లేకుండా యమధర్మరాజు ఈ శిక్షలను విధిస్తాడంటారు. ఇలా యమధర్మరాజు శిక్షలు విధించే చోటు భారత దేశంలోని హిమాచల్ ప్రదేశ్ లోని బర్మోరలో ఉంది. ఆ ఆలయ ప్రత్యేకతలు ఏంటి.. ఆ ఆలయానికి ఎలా చేరుకోవాలో తెలుసుకోండి.
హిమాచల్ ప్రదేశ్ లోని బర్మోర్ పట్టణంలో చౌరాసి దేవాలయాల సముదాయం ఉంది. ఇక్కడ మొత్తం 84 దేవాలయాలు ఉండటం వల్ల ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. ఇందులోని ఒక దేవాలయమే ధర్మేశ్వర్ మహాదేవ దేవాలయం. ఈ దేవాలయం చూడటానికి ఒక ఇల్లు లాగా ఉంటుంది. ఈ ఇంట్లోనే యమధర్మరాజు, చిత్రగుప్తుడు ఉంటూ పాప పుణ్యాల బేరీజు వేసి శిక్ష ఖరారు చేస్తారని స్థానికులు చెబుతారు. ఈ ఇల్లు లాంటి దేవాలయంలో రెండు ఖాళీ గదులు ఉంటాయి. మొదటి గదిలో చిత్రగుప్తుడు ఉంటారని చెబుతారు.
ఆత్మను యమభటులు ఇక్కడికి తీసుకువచ్చిన తర్వాత సదరు జీవి చేసిన పాపపుణ్యాలను విడమరిచి చెబుతాడు. అటుపై ఆత్మ రెండో గదిలోకి వెలుతుంది. అక్కడ సదరు పాపపుణ్యాలను అనుసరించి అక్కడ శిక్ష ఖరారు అవుతుంది. శిక్ష ఖారారైన తర్వాత యమలోకానికి వెళ్లి అక్కడ సదరు శిక్ష అనుభవిస్తుంది. ప్రతి జీవి ప్రాణం పోయిన తర్వాత ఆత్మ మొదట ఈ దేవాలయానికి తప్పక వస్తుందని ఇక్కడి నమ్మకం. ఈ విషయాన్ని గరుడ పురాణంతోపాటు మరికొన్ని పురాణాల్లోనూ ప్రస్తావించారు.
ఈ ఆలయంలో మరో నాలుగు కంటికి కనిపించని ద్వారాలు కూడా ఉన్నాయని చెబుతారు. అవి వరుసగా బంగారు, వెండి, కంచు, రాగితో తయారు చేయబడినవని చెబుతారు. పాపపుణ్యాలను అనుసరించి ఆత్మ వీటి ద్వారా బయటికి వస్తుందని స్థానికుల నమ్మకం. హిమాచల్ ప్రదేశ్ లోని చాంబా జిల్లాలో బర్మోర్ దేవాలయం ఉంది. ఈ పట్టణం ధర్మశాలకు 145 కిలోమీటర్ల దూరం, సిమ్లాకు 350 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
బర్మోర్ కు దగ్గరగా అంటే దాదాపు 199 కిలోమీటర్ల దూరంలో ధర్మశాల విమానాశ్రయం ఉంది. అక్కడి నుంచి ప్రభుత్వ, ప్రైవేటు బస్సు సదుపాయాలు ఉన్నాయి. ట్యాక్సీలు కూడా తిరుగుతున్నాయి. బర్మోర్ కు దగ్గరగా పఠాన్ కోట్ రైల్వే స్టేషన్ ఉంది. రెండు నగరాల మధ్య దూరం 190 కిలోమీటర్లు. రైల్వే స్టేషన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా బర్మోర్‌కు చేరుకోవచ్చు. హిమాచల్ ప్రదేశ్ లోని పలు నగరాల నుంచి బర్మోర్‌కు బస్సు సదుపాయాలు ఉన్నాయి. చాంబ నుంచి 60 కిలోమీటర్లు, ధర్మశాల నుంచి 145 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
సముద్ర మట్టానికి 2195 మీటర్ల ఎత్తులో ఉన్న బర్మోర్ చుట్టూ మంచుతో కప్పబడిన పర్వతాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ధర్మశాల, సిమ్లా వంటి ప్రాంతాలకు వేసవి కాలంలో ఇక్కడకు ఎక్కువ మంది వస్తుంటారు. కనుక మీకు కూడా ఖాళీ ఉంటే ఒకసారి సందర్శించండి మరి..!