Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఎంత అట్టహాసంగా ముగిసిందో అందరికీ తెలిసిందే. ఆ సీజన్ ఆరంభంలో పెద్దగా రేటింగ్స్ రాకపోయినా సరే.. రాను రాను హౌస్ లో కొందరు సభ్యులు చేసిన రొమాన్స్, ఇతర వివాదాలతో షోకు పేరు వచ్చింది. దీంతో షో చివరి ఎపిసోడ్స్‌కు భారీ ఎత్తున రేటింగ్స్ వచ్చాయి. ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఈ షోను వీక్షించారు. దీంతో బిగ్ బాస్ ఓటీటీని కూడా త్వరలోనే ప్రారంభిస్తామని అప్పట్లో నాగార్జున చెప్పారు. ఇక దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతున్నాయి.
బిగ్ బాస్ ఓటీటీ తెలుగు ఈ నెల 26వ తేదీన ప్రారంభం కానుందని తెలుస్తుండగా.. ఈ షోకు గాను కంటెస్టెంట్లను ఇప్పటికే క్వారంటైన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. అలాగే గత సీజన్లలో పార్టిసిపేట్ చేసిన తేజస్వి మడివాడ, ముమైత్ ఖాన్‌లను బిగ్ బాస్ ఓటీటీలోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా నిర్వాహకులు ఒక కీలక ప్రకటన చేశారు.
బిగ్ బాస్ ఓటీటీ తెలుగుకు గాను బిగ్ బాస్ నాన్ స్టాప్ అని టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇక ఇదే విషయాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ వారు తమ ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రోజుకు 24 గంటలూ నాన్‌స్టాప్‌గా బిగ్ బాస్ ఓటీటీ ద్వారా ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ అందించనున్నట్లు తెలిపారు. త్వరలోనే ఈ షో ప్రారంభం అవుతుందని అధికారికంగా వెల్లడించారు. దీంతో బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అయితే షోలో పాల్గొనే ఇతర కంటెస్టెంట్లతోపాటు షోకు సంబంధించిన మరిన్ని వివరాలను కూడా త్వరలోనే ప్రకటించనున్నారు. ఇక ఈ షోకు కూడా నాగార్జుననే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఈ షో రోజుకు 24 గంటలూ లైవ్ స్ట్రీమ్ కానుంది.