Biyyamlo Purugulu : బియ్యానికి పురుగులు ప‌డుతున్నాయా.. ఇలా చేస్తే పురుగులు ఉండ‌వు..!

Biyyamlo Purugulu : మ‌న నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌లో బియ్యం కూడా ఒక‌టి. అన్నం లేక‌పోతే మ‌న‌కు రోజు గ‌డ‌వ‌దు. మ‌నమంద‌రం క‌ష్ట‌ప‌డేది అన్నం కోస‌మే. బియ్యాన్ని రెండు, మూడు నెల‌కు స‌రిప‌డేలా లేదా ఆరు నెల‌ల‌కు స‌రిప‌డా కొనుగోలుచేసి నిల్వ చేసుకుంటుంటారు. ఇలా నిల్వ చేసుకోవ‌డం మంచిదే. కానీ ఇలా నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల బియ్యంలో పురుగులు ప‌డ‌తాయి. ఈ పురుగులు విస‌ర్జంచే వ్య‌ర్థాలు, మ‌లినాలు బియ్యానికి ప‌డ‌తాయి. ఇలాంటి బియ్యాన్ని వండుకుని తింటే లేనిపోని రోగాల బారిన ప‌డే అవ‌కాశాలు కూడా ఉంటాయి. క‌నుక మ‌నం బియ్యంలో పురుగులు ప‌డ‌కుండా నిల్వ చేసుకోవాలి.

మ‌న‌కు మార్కెట్ లో పురుగు ప‌ట్ట‌కుండా చేసే పౌడ‌ర్ లు దొరుకుతుంటాయి. ఈ పౌడ‌ర్ ను బియ్యంలో క‌ల‌ప‌డం వ‌ల్ల బియ్యం పురుగు ప‌ట్ట‌కుండా ఉంటుంది. కానీ ఇలా ర‌సాయ‌నాలు క‌లిగిన పౌడ‌ర్ ను వాడ‌డం వ‌ల్ల శ‌రీరానికి హాని క‌లుగుతుంద‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. ఇంటి చిట్కాల‌ను ఉప‌యోగించి మ‌నం బియ్యం పురుగు ప‌ట్ట‌కుండా చేయ‌వ‌చ్చు. పురుగు ప‌ట్టిన బియ్యాన్ని శుభ్రం చేయ‌డం చాలా క‌ష్టం. బియ్యం నుండి ఒక్కో పురుగును తీయ‌డం చాలా క‌ష్టం. వీటిని శుభ్రం చేయ‌డానికి కూడా చాలా స‌మ‌యం ప‌డుతుంది. బియ్యం పురుగు ప‌ట్టాక శుభ్రం చేయ‌డం కంటే పురుగు ప‌ట్ట‌కుండా ముందుగానే జాగ్ర‌త్త ప‌డ‌డం మంచిది.

Biyyamlo Purugulu follow these remedies
Biyyamlo Purugulu

బియ్యం పురుగుప‌ట్ట‌డానికి చాలా కార‌ణాలు ఉంటాయి. అందులో తేమ కూడా ఒక‌టి. బియ్యం నిల్వ చేసిన ప్ర‌దేశం చుట్టూ లేదా ఆ ప్ర‌దేశంలో తేమ ఉండ‌డం వ‌ల్ల బియ్యం పురుగు ప‌ట్టే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. క‌నుక బియ్యాన్ని నిల్వ చేసే ప్ర‌దేశం చుట్టూ తేమ లేకుండా చూసుకోవాలి. ఇంగువ‌ను ఉప‌యోగించి కూడా మ‌నం బియ్యం పురుగు ప‌ట్ట‌కుండా చేయ‌వ‌చ్చు. దీని ఘాటైన వాస‌న కార‌ణంగా బియ్యానికి పురుగులు ప‌ట్ట‌కుండా ఉంటాయి. ఇంగువ ముక్క‌ల‌ను లేదా పొడిని చిన్న చిన్న మూట‌లుగా క‌ట్టి బియ్యంలో అక్క‌డ‌క్క‌డ ఉంచాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల బియ్యం పురుగు ప‌ట్టకుండా ఉంటుంది.

క‌ర్ఫూరాన్ని కూడా ఇదే విధంగా మూట‌లుగా క‌ట్టి బియ్యంలో ఉంచ‌డం వ‌ల్ల పురుగులు ప‌ట్ట‌కుండా ఉంటాయి. బియ్యం పురుగు ప‌ట్ట‌కుండా చేయ‌డంలో వేపాకు ఎంతో సహాయ‌ప‌డుతుంది. బియ్యాన్ని నిల్వ చేసుకునే డ‌బ్బా అడుగు భాగాన వేపాకును ఉంచి ఈ వేపాకుపై బియ్యాన్ని పోయాలి లేదా వేప చెట్టు ఆకుల పొడిని మూట‌లుగా క‌ట్టి బియ్యంలో ఉంచాలి. ఇలా చేయ‌డం వల్ల కూడా బియ్యం పురుగు ప‌ట్ట‌కుండా ఉంటుంది.

వెల్లుల్లి రెబ్బ‌ల పొట్టు తీసి బియ్యంలో ఉంచ‌డం వల్ల బియ్యం పురుగు ప‌ట్ట‌కుండా ఉంటుంది. బియ్యం పురుగుప‌ట్ట‌కుండా చేయ‌డంలో ల‌వంగాలు స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తాయి. బియ్యంలో ల‌వంగాల‌ను ఉంచ‌డం వల్ల లేదా ల‌వంగాల పొడిని వస్త్రంలో క‌ట్టి బియ్యంలో ఉంచ‌డం వ‌ల్ల కూడా పురుగు ప‌ట్ట‌కుండా ఉంటుంది.

ఒక వ‌స్త్రంలో గుప్పెడు ఉప్పును ఉంచి మూట‌గా క‌ట్టి బియ్యంలో ఉంచ‌డం వ‌ల్ల పురుగులు ప‌ట్ట‌కుండా ఉంటాయి. ఇలా పురుగులు ప‌ట్టిన బియ్యంలో ఉంచినా కూడా పురుగులు తొల‌గిపోతాయి. ఎండ‌బెట్టిన కాక‌ర‌కాయ ముక్క‌ల‌ను లేదా వాటి పొడిని మూట‌గా క‌ట్టి బియ్యంలో ఉంచ‌డం వ‌ల్ల పురుగు ప‌ట్టకుండా ఉంటుంది. ఈ విధంగా ఇంటి చిట్కాల‌ను ఉప‌యోగించి మ‌నం బియ్యానికి పురుగు ప‌ట్టకుండా చేయ‌వ‌చ్చు.

D

Recent Posts