Boondi Laddu : మనకు పండుగలకు తయారు చేసుకునే తీపి వంటకాల్లో బూందీ లడ్డూలు ఒకటి. ఈ లడ్డూలను తినని వారు ఉండరనే చెప్పవచ్చు. చాలా మంది ఈ లడ్డూలను ఇష్టంగా తింటారు. చాలా మంది వీటిని ఎలా తయారు చేసుకోవాలో తెలియక స్వీట్ షాపులో కొనుగోలు చేసి తెచ్చకుంటున్నారు. ఈ బూందీ లడ్డూలను తయారు చేయడం చాలా సులభం. వంటరాని వారు మొదటిసారి చేసే వారు కూడా వీటిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. బూందీ లడ్డూలను ఏవిధంగా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బూందీ లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
జల్లించిన శనగపిండి – 2 కప్పులు, నీళ్లు – తగినన్ని, పంచదార – 2 కప్పులు, నీళ్లు – ఒకటింపావు కప్పు, పటిక – రెండు చిటికెలు, యాలకుల పొడి – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, ఎండుద్రాక్ష – 3 టేబుల్ స్పూన్స్, ఎండుద్రాక్ష – ఒక టీ స్పూన్.
బూందీ లడ్డూ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో శనగపిండిని తీసుకోవాలి. తరువాత అందులో తగినన్ని నీళ్లు పోసుకుంటూ దోశ పిండి కంటే కొద్దిగా పలుచగా కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా వేడయ్యాక బూందీ గరిటెలో పిండిని వేసి గిన్నెతో పిండిని రుద్దితే చక్కగా గుండ్రంగా ఉండే బూందీ నూనెలో పడుతుంది. లడ్డూ బూందీని కరకరలాడే వరకు వేయించకూడదు. బూందీ వేగి కొద్దిగా రంగు మారగానే ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా బూందీ అంతా తయారు చేసుకున్న తరువాత ఒక గిన్నెలో పంచదార, నీళ్లు పోసి వేడి చేయాలి. పంచదార కరిగి ముదురు తీగ పాకం వచ్చే వరకు ఉడికించాలి. పంచదార మిశ్రమాన్ని రెండు వేళ్లతో తీసుకుని చూస్తే వేళ్ల మధ్య చక్కగా తీగ రావాలి. ఇలా రాగానే యాలకుల పొడి, పటిక వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న పంచదార మిశ్రమంలో ముందుగా తయారు చేసుకున్న బూందీని వేసి బాగా కలపాలి. తరువాత నెయ్యిలో జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి కొద్దిగా రంగు మారే వరకు వేయించి లడ్డూ మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. ఈ లడ్డూ మిశ్రమం గోరు వెచ్చగా అయిన తరువాత చేతికి నెయ్యి రాసుకుంటూ తగినంత మిశ్రమాన్ని తీసుకుని లడ్డూలుగా చుట్టుకోవాలి. వీటిని రెండు గంటల పాటు కదిలించకుండా అలాగే ఉంచాలి. తరువాత గాలి, తడి తగలకుండా డబ్బాలో ఉంచి నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బూందీ లడ్డూ తయారవుతుంది. ఈ లడ్డూలు 15 రోజుల వరకు తాజాగా ఉంటాయి. పండుగలకు, ప్రత్యేక రోజుల్లో ఇలా ఎంతో రుచిగా ఉండే బూందీ లడ్డూలను తయారు చేసుకుని తినవచ్చు.