Bread Kaja : తీపి తినాల‌నుకుంటే 10 నిమిషాల్లోనే బ్రెడ్‌తో ఇలా చేసుకుని తిన‌వ‌చ్చు..!

Bread Kaja : చాలా తక్కువ స‌మ‌యంలో, రుచిగా తీపి ప‌దార్థాల‌ను త‌యారు చేయాలంటే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేది బ్రెడ్. బ్రెడ్ ను అప్పుడ‌ప్పుడూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డంతోపాటు దానితో ర‌క‌ర‌కాల తీపి ప‌దార్థాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. బ్రెడ్ ను ఉప‌యోగించి చేసే ఎటువంటి వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. కేవ‌లం 10 నిమిషాల్లోనే బ్రెడ్ తో రుచిగా తీపి వంట‌కాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రెడ్ కాజా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బ్రెడ్ స్లైసెస్ – 6, పంచ‌దార – అర క‌ప్పు, నీళ్లు – పావు క‌ప్పు, నూనె – డీప్ ఫ్రై కి స‌రిప‌డా, యాల‌కుల పొడి – కొద్దిగా, త‌రిగిన పిస్తా ప‌లుకులు – కొద్దిగా.

Bread Kaja very easy to make instant sweet
Bread Kaja

బ్రెడ్ కాజా త‌యారీ విధానం..

ముందుగా బ్రెడ్ అంచుల‌ను తీసేయాలి. త‌రువాత బ్రెడ్ ను త్రిభుజాకారంలో రెండు ముక్క‌లు అయ్యేలా క‌ట్ చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో పంచ‌దార, నీళ్లు పోసి పంచ‌దార క‌రిగే వ‌ర‌కు తిప్పుతూ వేడి చేయాలి. పంచ‌దార క‌రిగిన త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని మ‌రో 2 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి నూనె కాగిన త‌రువాత బ్రెడ్ ముక్క‌ల‌ను వేసి వేయించుకోవాలి.

రెండు వైపులా కూడా బ్రెడ్ ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న బ్రెడ్ ముక్క‌ల‌ను ముందుగా త‌యారు చేసిన పంచ‌దార మిశ్ర‌మంలో వేసి రెండు వైపులా తిప్పుతూ ఒక నిమిషం పాటు నాన‌బెట్టుకోవాలి. త‌రువాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న బ్రెడ్ ముక్క‌ల‌పై యాలకుల పొడిని, పిస్తా ప‌లుకుల‌ను చ‌ల్లుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల రుచిగా ఉండే బ్రెడ్ కాజా త‌యారవుతుంది. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు బ్రెడ్ తో ఇలా ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ కాజాను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Share
D

Recent Posts