Bread Pudding : మనం బ్రెడ్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బ్రెడ్ తో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. బ్రెడ్ తో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. బ్రెడ్ తో చేసుకోదగిన తీపి వంటకాల్లో బ్రెడ్ పుడ్డింగ్ కూడా ఒకటి. ఎక్కువగా రెస్టారెంట్ లలో ఈ వంటకం మనకు లభిస్తుంది. బ్రెడ్ పుడ్డింగ్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మనం ఇంట్లో కూడా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా ఉండే ఈ బ్రెడ్ పుడ్డింగ్ ను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రెడ్ పుడ్డింగ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బ్రెడ్ స్లైసెస్ – 5, పంచదార -పావు కప్పు, పాలు – ఒకటిన్నర కప్పు, కస్టర్డ్ పౌడర్ – 3 టీ స్పూన్స్, నీళ్లు – 1/3 కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్.
బ్రెడ్ పుడ్డింగ్ తయారీ విధానం..
ముందుగా బ్రెడ్ స్లైసెస్ ను తీసుకుని వాటికి చుట్టు ఉండే నల్లటి భాగాన్ని తీసివేయాలి. తరువాత వీటిని ముక్కలుగా చేసి జార్ లోకి తీసుకోవాలి. తరువాత ఈ బ్రెడ్ ముక్కలను పొడిగా అయ్యేలా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత ఒక కళాయిలో పంచదార తీసుకుని వేడి చేయాలి. పంచదార కరిగి క్యారమెల్ లా అయిన తరువాత దానిని వెడల్పుగా ఉండే గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఈ క్యారమెల్ ను గిన్నె అంతా వచ్చేలా స్ప్రెడ్ చేసుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కస్టర్డ్ పౌడర్ ను తీసుకుని అందులో నీళ్లు పోయాలి. దీనిని ఉండలు లేకుండా కలుపుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో పాలు, మరో అర కప్పు పంచదార వేసి వేడి చేయాలి.
పాలు మరిగి పొంగు వచ్చిన తరువాత ఇందులో ముందుగా తయారు చేసిన కస్టర్డ్ పౌడర్, యాలకుల పొడి వేసి కలపాలి. ఇలా కలపగానే చిక్కటి మిశ్రమం తయారవుతుంది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ముందుగా తయారు చేసుకున్న బ్రెడ్ పొడిని వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని క్యారమెల్ వేసిన గిన్నెలో వేసి పైన అంతా సమానంగా చేసుకోవాలి. ఇప్పుడు గిన్నెకు సరిపడా మూతను ఉంచి పక్కకు ఉంచాలి. తరువాత కుక్కర్ లో నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక అందులో స్టాండ్ ను ఉంచాలి. ఈ స్టాండ్ పై బ్రెడ్ పుడ్డింగ్ గిన్నెను మూతతో సహా ఉంచాలి. తరువాత కుక్కర్ పై సాధారణ మూతను ఉంచి 3 నుండి 5 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై ఉడికించాలి. తరువాత 30 నుండి 40 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి టూత్ పిక్ ను గుచ్చి చూడాలి.
టూత్ పిక్ కు ఏమి అంటుకోకుండా ఉంటే పుడ్డింగ్ తయారైనదిగా భావించాలి లేదా మరో 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు పుడ్డింగ్ గిన్నెను బయటకు తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత చాకుతో గిన్నెను నుండి వేరు చేసి ప్లేట్ లోకి తీసుకోవాలి. దీనిని మనకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ పుడ్డింగ్ తయారవుతుంది. దీనిని పిల్లలు మరింత ఇష్టంగా తింటారు. బ్రెడ్ తో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా పుడ్డింగ్ ను కూడా తయారు చేసుకుని తినవచ్చు.