Bread Rasmalai : బ్రెడ్ ర‌స‌మ‌లై.. అచ్చం స్వీట్ షాపుల్లో ఉండే విధంగా ఇలా చేసుకోవ‌చ్చు..!

Bread Rasmalai : మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భించే ప‌దార్థాల్లో ర‌స‌మ‌లై ఒక‌టి. ర‌స‌మ‌లై చాలా రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. సాధార‌ణంగా ర‌స‌మ‌లైను పాల‌ను విర‌గొట్టి త‌యారు చేస్తూ ఉంటారు. పాలు విర‌గొట్టే ప‌ని లేకుండా బ్రెడ్ తో కూడా మ‌నం ర‌స‌మ‌లైను త‌యారు చేసుకోవ‌చ్చు. బ్రెడ్ తో చేసే ఈ ర‌స‌మ‌లై కూడా చాలా రుచిగా ఉంటుంది. వంట‌రాని వారు, మొద‌టిసారి చేసే వారు ఎవ‌రైనా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ బ్రెడ్ ర‌స‌మ‌లై త‌యారీ విధానాన్ని అలాగే త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రెడ్ ర‌స‌మ‌లై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

తాజా బ్రెడ్ స్లైసెస్ – 8, చిక్క‌టి పాలు – ఒక లీట‌ర్, కుంకుమ పువ్వు – చిటికెడు, యాల‌కుల పొడి – అర టీ స్పూన్, ఎల్లో ఫుడ్ క‌ల‌ర్ – చిట‌కెడు, పంచ‌దార – 50 గ్రా., రోజ్ వాట‌ర్ – అర టీ స్పూన్.

Bread Rasmalai recipe very sweet easy to make
Bread Rasmalai

బ్రెడ్ ర‌స‌మ‌లై త‌యారీ విధానం..

ముందుగా బ్రెడ్ స్లైసెస్ ను తీసుకుని క‌ప్పుతో లేదా క‌ట్ట‌ర్ తో ర‌స‌మ‌లై ఆకారంలో గుండ్రండా క‌ట్ చేసుకోవాలి. త‌రువాత అడుగు మందంగా ఉండే క‌ళాయిలో పాలు, పంచ‌దార వేసి వేడి చేయాలి. ఈ పాల‌ను క‌లుపుతూ మ‌ధ్య‌స్థ మంట‌పై పావు లీట‌ర్ అయ్యే వ‌ర‌కు మ‌రిగించాలి. ఇలా మ‌రిగించిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి కుంకుమ పువ్వు, ఫుడ్ క‌ల‌ర్, యాల‌కుల పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత రోజ్ వాట‌ర్ వేసి క‌ల‌పాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీటిని తీసుకోవాలి. త‌రువాత క‌ట్ చేసుకున్న బ్రెడ్ ముక్క‌ల‌ను నీటిలో వేసి నాన‌బెట్టాలి. వీటిని 10 సెక‌న్ల పాటు నాన‌బెట్టిన త‌రువాత రెండు చేతుల‌తో గ‌ట్టిగా పిండి పాల‌ల్లో వేసుకోవాలి.

ఇలా అన్నింటిని వేసుకున్న త‌రువాత గంటె పెట్ట‌కుండా క‌ళాయిని ప‌ట్టుకుని అంతా క‌లిసేలా క‌దుపుతూ కలుపుకోవాలి. బ్రెడ్ నానిన త‌రువాత దానిని నెమ్మ‌దిగా గంటెతో ప్లేట్ లోకి తీసుకోవాలి. మిగిలిన పాల‌ను వాటిపై పోసి పిస్తా ప‌ప్పుతో గార్నిష్ చేసుకోవాలి. ఈ ర‌స‌మ‌లైను గంట పాటు ఫ్రిజ్ లో ఉంచి చ‌ల్ల‌గా అయిన త‌రువాత స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ ర‌స‌మ‌లై త‌యార‌వుతుంది. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు, స్పెష‌ల్ డేస్ లో ఇలా బ్రెడ్ తో ఎంతో రుచిగా ఉండే ర‌స‌మ‌లైను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts