Bun Dosa : మనం అల్పాహారంగా రకరకాల దోశలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. మనం సులభంగా తయారు చేసుకోదగిన రుచికరమైన దోశలల్లో బన్ దోశ కూడా ఒకటి. ఈ దోశ బన్ లాగా మెత్తగా, చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. అల్పాహారంగా తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. పిల్లలు దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. వెరైటీ దోశలను రుచి చూడాలనుకునే వారు ఈ దోశలను ఖచ్చితంగా తయారు చేసుకుని తినాల్సిందే. రుచిగా, మెత్తగా ఉండే ఈ బన్ దోశలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బన్ దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – ఒక కప్పు, మెంతులు – ఒక టీ స్పూన్, అటుకులు – పావు కప్పు, పెరుగు – ఒక కప్పు, ఉప్పు – తగినంత, వంటసోడా – పావు టీ స్పూన్.
బన్ దోశ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బియ్యం, మెంతులు, అటుకులు వేసి శుభ్రంగా కడగాలి. తరువాత పెరుగు, తగినన్ని నీళ్లు పోసి 5 గంటల పాటు నానబెట్టాలి. తరువాత ఈ బియ్యాన్ని జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత పిండిపై మూత పెట్టి రాత్రంతా పులియబెట్టాలి. పిండి చక్కగా పులిసిన తరువాత ఉప్పు, వంటసోడా వేసి కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. తరువాత స్టవ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక నూనె వేసి తుడవాలి. తరువాత గంటెతో పిండిని తీసుకుని పెనం మీద వేసుకోవాలి.
ఈ పిండిని గంటెతో పలుచటి దోశలాగా రుద్దకూడదు. దోశ కొద్దిగా కాలి బుడగుల వచ్చిన తరువాత నూనె వేసి మూత పెట్టి 2 నిమిషాల పాటు కాల్చుకోవాలి. తరువాత మరో వైపుకు తిప్పి మరో నిమిషం పాటు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బన్ దోశ తయారవుతుంది. దీనిని ఏ చట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. తరచూ ఒకేరకం దోశలు కాకుండా ఇలా వెరైటీగా బన్ దోశలను కూడా తయారు చేసుకుని తినవచ్చు.