Cabbage Nilva Pachadi : క్యాబేజిను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. క్యాబేజి కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనితో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. క్యాబేజి వేపుడు, పప్పు, వంటి వాటితో పాటు వివిధ రకాల చిరుతిళ్లను కూడా తయారు చేస్తాము. ఇవే కాకుండా క్యాబేజితో ఎంతో రుచిగా ఉండే నిల్వ పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పచ్చడిని చూస్తేనే నోట్లో నీళ్లు ఊరుతాయని చెప్పవచ్చు. వేడి వేడి అన్నం, నెయ్యితో కలిపి ఈ పచ్చడినితింటే ఎంతో రుచిగా ఉంటుంది. క్యాబేజి ఉంటే చాలు ఈ పచ్చడిని 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా అంటే చాలా తేలిక. ఎంతో రుచిగా కమ్మగా ఉండే ఈ క్యాబేజి నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాబేజి నిల్వ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
ఆవాలు – 100 గ్రా., పసుపు – అర స్పూన్, ఉప్పు – 100 గ్రా., కారం – 100 గ్రా., క్యాబేజి తురుము – 500 గ్రా., నువ్వుల నూనె – 300 గ్రా., నిమ్మ ఉప్పు – అర టీ స్పూన్.
క్యాబేజి నిల్వ పచ్చడి తయారీ విధానం..
ముందుగా క్యాబేజిని శుభ్రపరచకుండా నిలువుగా కట్ చేసుకోవాలి. తరువాత ఒక జార్ లో ఆవాలు, పసుపు, కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో మిగిలిన ఉప్పు, కారంవేసి బాగా కలపాలి. తరువాత క్యాబేజి తురుమును వేసుకోవాలి. తరువాత నువ్వుల నూనె కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. తరువాత నిమ్మ ఉప్పు వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల క్యాబేజి పచ్చడి తయారవుతుంది.
దీనిని గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి. దీనిని రెండు రోజుల తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యాబేజి నిల్వ పచ్చడి తయారవుతుంది. ఈ పచ్చడిలో నిమ్మ ఉప్పుకు బదులుగా నిమ్మరసాన్ని కూడా ఉపయోగించవచ్చు. అయితే ఈ నిమ్మరసాన్ని ఒక రోజంతా ఎండలో ఉంచి ఆ తరువాత పచ్చడిలో వేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల పచ్చడి పాడవకుండా ఎక్కువ కాలం పాటు తాజాగా ఉంటుంది. క్యాబేజి తినని వారు కూడా ఈ పచ్చడిని లొట్టలేసుకుంటూ ఇష్టంగా తింటారు.