Capsicum Kurma : క్యాప్సికంను మనం వంటల్లో విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. క్యాప్సికం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని కూడా ఆహారంలో భాగంగా తప్పకుండా తీసుకోవాలి. క్యాన్సికంతో మనం కూరలను కూడా తయారు చేస్తూ ఉంటాం. క్యాప్సికంతో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. అందులో భాగంగా క్యాప్సికంతో ఎంతో రుచిగా ఉండే క్యాప్సికం కుర్మా ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాప్సికం కుర్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్స్, కర్బూజ గింజలు – 2 టేబుల్ స్పూన్స్, ఎండు కొబ్బరి పొడి – పావు కప్పు, పచ్చిమిర్చి – 2, నూనె – పావు కప్పు, క్యాప్సికం – 2, చిన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, పసుపు – రెండు చిటికెలు, ఉప్పు – తగినంత, టమాటాలు – 2, నీళ్లు – 300 ఎమ్ ఎల్, కారం – ఒక టేబుల్ స్పూన్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్.
క్యాప్సికం కుర్మా తయారీ విధానం..
ముందుగా కళాయిలో జీడిపప్పు, కర్బూజ గింజలు వేసి వేయించాలి. వీటిని దోరగా వేయించిన తరువాత ఎండు కొబ్బరి వేసి కలపాలి. దీనిని రంగు మారే వరకు వేయించి జార్ లోకి తీసుకోవాలి. తరువాత పచ్చిమిర్చి, తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక క్యూబ్స్ లాగా తరిగిన క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి. వీటిని 50 శాతం వరకు వేయించిన తరువాత ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే నూనెలో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు వేయించిన తరువాత అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, ఉప్పు వేసి కలపాలి.
తరువాత టమాట ఫ్యూరీ వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత జీడిపప్పు పేస్ట్, నీళ్లు పోసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు ఉడికించిన తరువాత క్యాప్సికం ముక్కలు, కారం వేసి కలపాలి. ఇప్పుడు దీనిని చిన్న మంటపై నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత నెయ్యి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యాప్సికం కుర్మా తయారవుతుంది. ఈ కుర్మాను దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. క్యాప్సికంతో ఈ విధంగా చేసిన కుర్మాను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.