Carrot Rava Laddu : క్యారెట్లను చాలా మంది పచ్చిగా తింటుంటారు. క్యారెట్లను జ్యూస్‌లా చేసి కూడా తాగుతారు. క్యారెట్లను తినడం వల్ల మనం ఎన్నో పోషకాలను పొందవచ్చు. ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అయితే క్యారెట్లను కూరల్లోనే కాకుండా వాటితో ఎంతో రుచికరమైన స్వీట్లు కూడా చేయవచ్చు. అలాంటి వాటిల్లో క్యారెట్ రవ్వ లడ్డు ఒకటి. దీన్ని చేయడం చాలా సులభం. రుచిగా కూడా ఉంటాయి. క్యారెట్ రవ్వ లడ్డూలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యారెట్ రవ్వ లడ్డూల తయారీకి కావల్సిన పదార్థాలు..
క్యారెట్ తురుము – ఒక కప్పు, బొంబాయి రవ్వ – 2 కప్పులు, పాలు – పావు కప్పు, చక్కెర – ఒక కప్పు, నెయ్యి – పావు కప్పు, యాలకుల పొడి – ఒక టీస్పూన్, జీడిపప్పు – తగినంత.
క్యారెట్ రవ్వ లడ్డూలను తయారు చేసే విధానం..
బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు వేయించి తీయాలి. అందులోనే రవ్వ కూడా వేసి దోరగా కమ్మని వాసన వచ్చే వరకు వేయించి తీసి పక్కన ఉంచాలి. బాణలిలో మిగిలిన నెయ్యి కూడా వేసి క్యారెట్ తురుము వేసి వేయించాలి. అది వేగాక వేయించి ఉంచిన బొంబాయి రవ్వ, చక్కెర వేసి కలపాలి. ఇప్పుడు పాలు కూడా పోసి కలపాలి. చివరగా యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు వేసి కలిపి చేతులకు నెయ్యి రాసుకుంటూ లడ్డూలలా చుట్టుకోవాలి. దీంతో ఎంతో రుచికరమైన క్యారెట్ రవ్వ లడ్డూలు తయారవుతాయి. వీటిని చాలా తక్కువ సమయంలోనే చేయవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు క్యారెట్లతో ఇలా రుచిగా రవ్వ లడ్డూలను చేయవచ్చు. వీటిని అందరూ ఎంతో ఇష్టపడతారు.