Cashew Nuts Laddu : ఈ ల‌డ్డూలు ఎంత బ‌ల‌మో తెలుసా.. రోజుకు ఒకటి తినాలి..

Cashew Nuts Laddu : ల‌డ్డూల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. కింద చెప్పిన విధంగా డ్రై ఫ్రూట్స్ తో ల‌డ్డూల‌ను త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. గ‌ర్బిణీ స్త్రీలు, ఎదిగే పిల్ల‌లు, బాలింత‌లు, వృద్ధులకు వీటిని ఆహారంగా ఇవ్వ‌డం వల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించ‌వ‌చ్చు. ఈ డ్రై ఫ్రూట్ ల‌డ్డూల‌ను తిన‌డం వల్ల ఎముక‌లు ధృడంగా ఉంటాయి. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది, గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. జుట్టు మ‌రియు చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటాయి. జ్ఞాప‌క శ‌క్తి పెరుగుతుంది. పిల్ల‌ల్లో ఎదుగుద‌ల చ‌క్క‌గా ఉంటుంది. ఈ విధంగా మ‌న‌కు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అందించే ఈ డ్రై ఫ్రూట్ ల‌డ్డూను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

డ్రై ఫ్రూట్ ల‌డ్డూ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

జీడిప‌ప్పు – పావు క‌ప్పు, బాదం ప‌ప్పు – పావు క‌ప్పు, గుమ్మ‌డి గింజ‌లు – పావు క‌ప్పు, నువ్వులు – ఒక క‌ప్పు, అవిసె గింజ‌లు – పావు క‌ప్పు,ప‌ల్లీలు – పావు క‌ప్పు, బెల్లం తురుము – ఒక క‌ప్పు, యాల‌కుల పొడి – ఒక టీ స్పూన్.

Cashew Nuts Laddu recipe in telugu very healthy and tasty
Cashew Nuts Laddu

డ్రై ఫ్రూట్ ల‌డ్డూ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో జీడిప‌ప్పు, బాదం ప‌ప్పు వేసి వేయించాలి. వీటిని దోర‌గా వేయించిన త‌రువాత గుమ్మ‌డి గింజల ప‌ప్పును వేసి వేయించాలి. త‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు ఉంచాలి. అదే క‌ళాయిలో నువ్వులు వేసి వేయించాలి. నువ్వులు చిట‌ప‌ట‌లాడే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అవిసె గింజ‌ల‌ను వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత ప‌ల్లీలు వేసి వేయించాలి. ప‌ల్లీలు వేగిన త‌రువాత‌ ప్లేట్ లోకి తీసుకుని పొట్టు తీయాలి. ఇప్పుడు జార్ లో వేయించిన ప‌ల్లీలతో పాటు ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్, యాల‌కుల పొడి వేసి బ‌ర‌క‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత అదే జార్ లో వేయించిన నువ్వులు, అవిసె గింజ‌లు వేసి బ‌ర‌క‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఇందులోనే బెల్లం వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి.

త‌రువాత ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న పొడిని కూడా వేసి అంతా క‌లిసేలా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత దీనిని గిన్నెలోకి తీసుకుని ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి. త‌రువాత కొద్ది కొద్దిగా మిశ్ర‌మాన్ని తీసుకుంటూ ల‌డ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే డ్రై ఫ్రూట్ ల‌డ్డూ త‌యార‌వుతుంది. వీటిని రోజుకు ఒక‌టి లేదా రెండు చొప్పున తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలన్నీ ల‌భిస్తాయి. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ తో ల‌డ్డూల‌ను చేసుకుని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

D

Recent Posts