Chakkera Pongali Recipe : చాలా సులభంగా, త్వరగా తయారు చేసుకోగలిగిన తీపి వంటకాల్లో చక్కెర పొంగలి ఒకటి. దీనిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. చక్కెర పొంగలిని ఇష్టంగా తినే వారు మనలో చాలా మంది ఉండే ఉంటారు. దీని రుచి గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. చక్కెర పొంగలిని తరచూ తయారు చేస్తూనే ఉంటారు. అయినప్పటికి దీనిని మరింత రుచిగా ఎలా తయారు చేసుకోవాలి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చక్కెర పొంగలి తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసరపప్పు – పావు కప్పు, బియ్యం – ముప్పావు కప్పు, నీళ్లు – రెండు కప్పులు, బెల్లం తురుము – అర కప్పు, పంచదార – ముప్పావు కప్పు, నీళ్లు – కొద్దిగా, నెయ్యి -6 టేబుల్ స్పూన్స్, ఎండు కొబ్బరి ముక్కలు – పావు కప్పు, జీడిపప్పు పలుకులు – 15, ఎండు ద్రాక్ష – కొద్దిగా, యాలకుల పొడి – అర టీ స్పూన్, పచ్చ కర్పూరం – చిటికెడు.
చక్కెర పొంగలి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో పెసరపప్పు వేసి చిన్న మంటపై దోరగా వేయించాలి. తరువాత ఒక కుక్కర్ లో బియ్యాన్ని వేసి కడగాలి. తరువాత ఇందులో వేయించిన పెసరపప్పు, నీళ్లు పోసి మూత పెట్టి పెద్ద మంటపై మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత కళాయిలో బెల్లం, పంచదార కొద్దిగా నీటిని పోసి వేడి చేయాలి. దీనిని లేత పాకం కంటే కొద్దిగా ఎక్కువగా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసిన బెల్లం మిశ్రమాన్ని వడకడుతూ ముందుగా ఉడికించిన అన్నంలో వేసి కలపాలి. తరువాత అన్నం, బెల్లం మిశ్రమాన్ని పీల్చుకునేలా మధ్యస్థ మంటపై కలుపుతూ ఉడికించాలి. అన్నం ఉడుకుతుండగానే కళాయిలో3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి వేయించుకోవాలి. ఇలా వేయించిన డ్రై ఫ్రూట్స్ ను ఉడుకుతున్న అన్నంలో వేసి కలపాలి.
తరువాత మరో 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి కలిపిన అన్నం దగ్గర పడే వరకు ఉడికించాలి. అన్నం దగ్గర పడిన తరువాత యాలకుల పొడి, పచ్చ కర్పూరం పొడి వేసి కలపాలి. చివరగా మరో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చక్కెర పొంగలి తయారవుతుంది. దీనిని బయట రెండు రోజుల పాటు ఉంచిన పాడవకుండా ఉంటుంది. తీపి తినాలనిపించినప్పుడు ఈ విధంగా చక్కెర పొంగలిని తయారు చేసుకుని తినవచ్చు. ఈ చక్కెర పొంగలిని అందరూ విడిచి పెట్టకుండా ఇంకా కావాలని అడిగి మరీ తింటారు.