Curd And Buttermilk : మనం రోజూ ఆహారంలో భాగంగా పెరుగును తీసుకుంటూ ఉంటాం. అలాగే పెరుగు నుండి తయారు చేసిన మజ్జిగను కూడా మనం ఆహారంగా తీసుకుంటాం. మనలో కొంత మంది మజ్జిగనే ఎక్కువగా ఇష్టపడతారు. రోజూ భోజనంలో కూడా ఒకటి లేదా రెండు గ్లాసుల మజ్జిగనే తీసుకుంటూ ఉంటారు. అసలు మజ్జిగను తాగడం మంచిదేనా.. మజ్జిగను తాగడం వల్ల లాభామా, నష్టమా.. మజ్జిగను తీసుకోకపోతే ఏమవుతుంది.. పెరుగు మంచిదా లేదా మజ్జిగ మంచిదా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అందరికి పెరుగు సరిపోదు కనుక దానిని మజ్జిగగా చేసి అందరూ ఆహారంగా తీసుకునే వారు. మంది ఎక్కువైతే మజ్జిగ పలుచనా అనేక సామెత కూడా మనకు వాడుకలో ఉంది. అలాగే పూర్వం రోజుల్లో వంటలు ఎక్కువగా వండే వారు కాదు. అన్నమే వారికి ప్రధాన ఆహారంగా ఉంది.
అన్నం సులభంగా లోపలికి వెళ్లడానికి మజ్జిగ ఎక్కువగా సహాయపడేది. ఈ విధంగా మనకు మజ్జిగ కూడా ఆహారంలో భాగమైంది. అలాగే చాలా మంది పుల్లటి మజ్జిగను తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తారు. పుల్లటి మజ్జిగ ఆరోగ్యానికి మేలు చేస్తుందన్న విషయం శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది. కేవలం పుల్లటి మజ్జిగతోనే కాదు పుల్లటి పెరుగును తీసుకున్నా కూడా మనం ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అదే విధంగా చాలా మంది మజ్జిగ శరీరానికి చలువ చేస్తుంది. పెరుగు వేడి చేస్తుందని అనుకుంటారు. కానీ పెరుగు కూడా శరీరానికి చలువే చేస్తుందని, పెరుగును ఆహారంగా తీసుకోవడం వల్ల వేడి చేయదని నిపుణులు చెబుతున్నారు.
అదేవిధంగా అన్నంలో మజ్జిగను వేసుకుని తినడానికి బదులుగా తగినంత పెరుగు వేసుకుని తినడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. పెరుగులో నీటిని పోసి మనం మజ్జిగను తయారు చేస్తాము. భోజన సమయంలో మజ్జిగను తీసుకోవడం వల్ల మనం నీటిని తీసుకున్నట్టే అవుతుందని భోజన సమయంలో నీటిని ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని వారు తెలియజేస్తున్నారు. అలాగే మజ్జిగను ఎక్కువగా తీసుకోవడం వల్ల పొట్టలో ఆహారాన్ని జీర్ణం చేయడానికి విడుదలయ్యే రసాయనాలు పలుచగా అవుతాయి. దీంతో ఆహారం ఎక్కువ సేపు జీర్ణం అవ్వకుండా పొట్టలో అలాగే ఉంటుంది. కనుక ఆహారంగా మజ్జిగకు బదులుగా పెరుగు తీసుకోవడమే మనకు మంచిది. వేడి చేసినప్పుడు చాలా మంది మజ్జిగను తాగుతుంటారు.
మజ్జిగకు బదులుగా ఎక్కువగా నీటిని తీసుకున్నా కూడా వేడి తగ్గి శరీరానికి చలువ చేస్తుంది. అదేవిధంగా చాలా మంది బరువు తగ్గడానికి ఆహారాన్ని తక్కువగా తీసుకుని మజ్జిగను తాగుతుంటారు. ఇలా చేయకూడదని, దీని వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మజ్జిగను తాగడం వల్ల మన శరీరానికి కలిగే లాభాలు చాలా తక్కువగా ఉంటాయని మజ్జిగను తాగకపోయిన ఎటువంటి నష్టం కలగదని మజ్జిగకు బదులుగా పెరుగును తీసుకుంటేనే మన ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.