Chapati Egg Rolls : మనం సాధారణంగా తరచూ చపాతీలను తింటూ ఉంటాం. వీటితో ఏదైనా కూర కలిపి తినడం చాలా మందికి అలవాటు. వెజ్, నాన్ వెజ్ ఇలా రకరకాల కూరలను చపాతీలతో తింటే చాలా బాగుంటాయి. అయితే చపాతీలతో ఎంతో రుచిగా ఉండే ఎగ్ రోల్స్ ని కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా సులభమే. పైగా వీటిని తింటే పోషకాలు, ఆరోగ్యకరమైన ప్రయోజనాలు లభిస్తాయి. ఈ క్రమంలోనే చపాతీ ఎగ్ రోల్స్ తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో.. వాటిని ఎలా తయారు చేయాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
చపాతీ ఎగ్ రోల్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమ పిండి – ఒక కప్పు, బటర్ – ఒక టీ స్పూన్, ఉప్పు – ఒక టీ స్పూన్, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – ఒక కప్పు, పొడుగ్గా తరిగిన క్యాప్సికం ముక్కలు – పావు కప్పు, సన్నగా పొడుగ్గా తరిగిన క్యాబేజీ – ఒక కప్పు, తరిగిన పచ్చి మిర్చి – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, చిల్లి ప్లేక్స్ – అర టీ స్పూన్, ఎగ్స్ – 5, నీళ్లు – సరిపడా, నూనె – ఒక కప్పు, టమాట కెచప్ – అర కప్పు.
చపాతీ ఎగ్ రోల్స్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో గోధుమ పిండి, బటర్, చిటికెడు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సరిపడా నీటిని పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకుని మూత పెట్టి 10 నుండి 15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. తరువాత ఒక కళాయిలో ఒక టీ స్పూన్ నూనెను వేసి కాగాక అందులో ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, క్యాబేజీ వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక పచ్చి మిర్చి ముక్కలు, మిరియాల పొడి, చిల్లీ ప్లేక్స్ వేసి బాగా కలుపుకోవాలి. వీటిని ఎక్కువగా వేయించకూడదు. కొద్దిగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మరో గిన్నెలో ఎగ్స్ తోపాటుగా చిటికెడు ఉప్పును వేసి తెల్ల సొన, పచ్చ సొన కలిసేలా బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండితో మరీ పలుచగా కాకుండా చపాతీని చేసి పెనంపై వేసి రెండు దిక్కులా నూనెను వేస్తూ కాల్చుకోవాలి. చపాతీ కాలిన తరువాత చపాతీపై ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసి చపాతీ అంతటా వచ్చేలా పరుచుకోవాలి. 10 సెకన్ల తరువాత చపాతీని మరో వైపు తిప్పి కొద్దిగా నూనె వేసుకుంటూ తక్కువ మంటపై రెండు దిక్కులా కాల్చుకోవాలి. చపాతీ పూర్తిగా కాలిన తరువాత ఈ చపాతీని ఒక ప్లేట్ లో ఎగ్ వేసిన వైపు పైకి వచ్చేలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న చపాతీ మధ్య భాగంలో ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ, క్యాప్సికం, క్యాబేజిల మిశ్రమాన్ని ఉంచి దానిపై కొద్దిగా టమాటా కెచప్ ను వేసి రోల్స్ లా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చపాతీ ఎగ్ రోల్స్ తయారవుతాయి. వీటిని బ్రేక్ ఫాస్ట్ లా లేదా స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు.