Tomato Rasam : మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందించే కూరగాయల్లో టమాటాలు ఒకటి. వీటిని రోజూ చాలా మంది అనేక రకాల కూరల్లో వేస్తుంటారు. వీటితో నేరుగా వివిధ రకాల వంటలు కూడా చేసుకోవచ్చు. అయితే టమాటాలతో రసం తయారు చేసుకుని తింటే ఎంతో రుచిగా ఉండడంతోపాటు మనకు పలు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఇక టమాటా రసం ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
టమాటా రసం తయారీకి కావల్సిన పదార్థాలు..
పెద్దగా తరిగిన టమాట ముక్కలు – రెండు కప్పులు, చింతపండు – 50 గ్రా., ఉప్పు – రుచికి తగినంత, పసుపు – ఒక టీ స్పూన్, ధనియాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, మెంతులు – ఒక టీ స్పూన్, ఎండు మిరపకాయలు – 4, వెల్లుల్లి రెబ్బలు – 5, చిన్న ఎండు కొబ్బరి ముక్కలు – 2 లేదా 3, చిన్న అల్లం ముక్కలు – 2, నీళ్లు – 2 గ్లాసులు, నూనె – ఒక టీ స్పూన్.
తాళింపుకు కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టీ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, ఎండు మిర్చి – 2, కరివేపాకు – ఒక రెబ్బ, తరిగిన ఉల్లిపాయ ముక్కలు – పావుకప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
టమాట రసం తయారు చేసే విధానం..
ముందుగా ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ నూనెను వేసి తరిగిన టమాట ముక్కలను, చింత పండు, రుచికి సరిపడా ఉప్పు, పసుపును వేసి టమాటాలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. తరువాత ఒక జార్ లో కానీ, రోట్లో కానీ నీళ్లను తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి కచ్చ పచ్చగా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మెత్తగా చేసుకున్న టమాటాలలో 2 గ్లాసుల నీటిని పోసి మరో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక కళాయిలోనూనె వేసి కాగాక, కొత్తిమీర తప్ప మిగిలిన తాళింపు పదార్థాలన్నీ వేసి వేయించుకోవాలి. తాళింపు వేగాక ముందుగా కచ్చ పచ్చగా చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి కొద్దిగా వేయించిన తరువాత, ఉడికించుకున్న టమాటాల రసం వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న టమాట రసాన్ని మరో పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే టమాట రసం తయారవుతుంది.
టమాటా రసాన్ని ఇలా తయారు చేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. పైగా టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి కనుక శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు ఉన్నవారు ఈ రసం తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. శ్వాస కోశ సమస్యలు తగ్గుతాయి.