Chemagadda Karam Pulusu : మనం ఆహారంగా తీసుకునే వాటిల్లో చామగడ్డలు కూడా ఒకటి. చామగడ్డలు ఎన్నో పోషకాలను, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. చామగడ్డలతో చేసే కూరలు చాలా రుచిగా ఉంటుంది. వీటితో తయారు చేసుకోదగిన కూరల్లో పులుసు కూడా ఒకటి. చామగడ్డల పులుసు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ పులుసు ఇష్టంగా తింటారు. రుచిగా, సులభంగా ఈ చామగడ్డల పులుసును రాయలసీమ స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చామగడ్డ కారం పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించి తరిగిన చామ గడ్డలు – పావు కిలో, నూనె – పావు కప్పు, ఆవాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, ఎండుమిర్చి – 4, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 10, తరిగిన పచ్చిమిర్చి – 4, కరివేపాకు – రెండు రెమ్మలు, తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, తరిగిన పెద్ద టమాట – 1, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – రెండు టీ స్పూన్ల, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, నానబెట్టిన చింతపండు – పెద్ద నిమ్మకాయంత, నీళ్లు – 400 ఎమ్ ఎల్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
చామగడ్డ కారం పులుసు తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, మెంతులు వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఇవన్నీ చక్కగా వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత టమాట ముక్కలు, పసుపు, ఉప్పు వేసి కలపాలి. టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించిన తరువాత కారం, ధనియాల పొడి, మిరియాల పొడి వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. తరువాత చింతపండు రసం వేసి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. తరువాత నీళ్లు, చామగడ్డ ముక్కలు వేసి కలపాలి.
తరువాత దీనిని 30 నుండి 40 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై ఉడికించాలి. చివరగా కొత్తిమీరను వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చామగడ్డ పులుసు తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. చామగడ్డలతో ఈ విధంగా తయారు చేసిన పులుసును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ పులుసు రెండు నుండి మూడు రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది.