Chepala Vepudu : చేపలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో చేపల వేపుడు కూడా ఒకటి. చేపల వేపుడు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. సైడ్ డిష్ గా తీసుకోవడానికి ఇది చాలాచక్కగా ఉంటుంది. అలాగే మనం వివిధ రుచుల్లో ఈ చేపల వేపుడును తయారు చేస్తూ ఉంటాము. కింద చెప్పిన విధంగా చేసే చేపల వేపుడు కూడా చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఈ చేపల వేపుడును రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. క్రిస్పీగా, రుచిగా ఉండే ఈ చేపల వేపుడును ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చేపల వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
పాంప్లెట్ ఫిష్ – 2, అల్లం – ఒక ఇంచు ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 8, అరగంట పాటు నానబెట్టిన ఎండుమిర్చి – 8, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, మిరియాలు – 8, జీలకర్ర – అర టీ స్పూన్, సోంపు గింజలు – కొద్దిగా, లవంగాలు – 2, పసుపు – అర టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, బియ్యంపిండి – ఒక టేబుల్ స్పూన్.
చేపల వేపుడు తయారీ విధానం..
ముందుగా పాంప్లెట్ చేపలకు గాట్లు పెట్టుకోవాలి. తరువాత వీటిపై అర చెక్క నిమ్మరసం, కొద్దిగా ఉప్పు వేసి చేపలకు బాగా పట్టించాలి. తరువాత ఒక జార్ లో అల్లం, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, ధనియాల పొడి, ఉప్పు, మిరియాలు, జీలకర్ర, సోంపు గింజలు, లవంగాలు, పసుపు, కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో నూనె, బియ్యంపిండి వేసి బాగా కలుపుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని చేపలకు పట్టించి మూత పెట్టి అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చేపలను వేసి వేయించాలి. వీటిని ఎక్కువగా కదపకుండా మధ్యస్థ మంటపై ఎర్రగా, క్రిస్పీగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చేపల వేపుడు తయారవుతుంది. మనకు నచ్చిన ఏ చేపలతో అయినా ఇలా వేపుడును తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్న చేపల వేపుడును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.