Chicken Lollipop : మనకు రెస్టారెంట్ లలో లభించే చికెన్ వెరైటీలల్లో చికెన్ లాలిపాప్స్ కూడా ఒకటి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. స్టాటర్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఈ చికెన్ లాలిపాప్స్ ను మం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా సులభం. కింద చెప్పిన విధంగా చేయడం వల్ల రెస్టారెంట్ స్టైల్ చికెన్ లాలిపాప్స్ ను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్ చికెన్ లాలిపాప్స్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ లాలిపాప్ తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ లెగ్ పీసెస్ – 7, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, సోయా సాస్ – అర టీ స్పూన్, షెజ్వాన్ సాస్- ఒక టీ స్పూన్, నూనె – 2 టీ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్, మైదాపిండి – 3 టేబుల్ స్పూన్స్, రెడ్ ఫుడ్ కలర్ – చిటికెడు.
టాసింగ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, సోయా సాస్ – అర టీ స్పూన్, టమాట సాస్ – 2 టీ స్పూన్స్, రెడ్ చిల్లీ సాస్ – 2 టీస్పూన్స్, మిరియాల పొడి -అర టీ స్పూన్, షెజ్వాన్ సాస్ – అర టీ స్పూన్, వెనిగర్ – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
చికెన్ లాలిపాప్ తయారీ విధానం..
ముందుగా చికెన్ లెగ్ పీసెస్ ను తీసుకుని వాటిని లాలిపాప్ లాగా కట్ చేసుకోవాలి. లెగ్ పీసె చివరన పట్టుకుని స్కిన్ ను నెమ్మదిగా కట్ చేస్తూ పైకి అనాలి. పైన ఎక్కువగా ఉండే చికెన్ ను కట్ చేసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, గరం మసాలా, సోయా సాస్, షెజ్వాన్ సాస్, నూనె వేసి బాగా కలపాలి. తరువాత వీటిపై మూత పెట్టి అరగంట పాటు పక్కకు ఉంచాలి. తరువాత ఇందులో మైదాపిండి, ఫుడ్ కలర్, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలపాలి. తరువాత వీటిని నూనెలో వేసి వేయించాలి.
ఈ పీసెస్ ను అటూ ఇటూ తిప్పుతూ మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత టాసింగ్ కు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత సోయా సాస్, టమాట సాస్, రెడ్ చిల్లీ సాస్, మిరియాల పొడి, షెజ్వాన్ సాస్, వెనిగర్ వేసి కలపాలి. తరువాత చికెన్ లాలిపాప్స్ వేసి వేయించాలి. వీటికి మసాలాలన్నీ చక్కగా పట్టే వరకు వేయించి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ లాలీపాప్స్ తయారవుతాయి. ఇలా ఇంట్లోనే చాలా సులభంగా చికెన్ లాలిపాప్స్ ను తయారు చేసి తీసుకోవచ్చు.