Chicken Noodles : మనకు సాయంత్రం సమయాల్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లల్లో లభించే చిరుతిళ్లల్లో చికెన్ నూడుల్స్ కూడా ఒకటి. చికెన్ నూడుల్స్ చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా రుచిగా ఉంటాయి. స్ట్రీట్ స్టైల్ చికెన్ నూడుల్స్ ను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. స్నాక్స్ తినాలనిపించినప్పుడు, ఇంట్లోపార్టీస్ జరిగినప్పుడు ఇలా చికెన్ నూడుల్స్ ను తయారు చేసి తీసుకోవచ్చు. స్ట్రీట్ స్టైల్ చికెన్ నూడుల్స్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ నూడుల్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూడుల్స్ – 150 గ్రా., బోన్ లెస్ చికెన్ ముక్కలు – అర కప్పు, కోడిగుడ్లు – 2,చిన్నగా తరిగిన వెల్లుల్లి తరుగు – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, మిరియాల పొడి – అర టీ స్పూన్, స్ప్రింగ్ ఆనియన్స్ – కొద్దిగా, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, నూనె – 2 టీ స్పూన్స్, అల్లం తరుగు – అర టీ స్పూన్, వెనిగర్ – ఒక టీ స్పూన్, సోయా సాస్ – ఒక టీ స్పూన్, పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, పొడవుగా తరిగిన క్యారెట్ తరుగు – పావు కప్పు, క్యాబేజి తరుగు – పావు కప్పు, గ్రీన్ చిల్లీ సాస్ – ఒక టీస్పూన్, షెజ్వాన్ సాస్ – ఒక టీ స్పూన్, టమాట కిచప్ – ఒక టీ స్పూన్.
చికెన్ నూడుల్స్ తయారీ విధానం..
ముందుగా నూడుల్స్ ను పొడిపొడిగా ఉడికించి పక్కకు ఉంచాలి. తరువాత గిన్నెలో కోడిగుడ్లను తీసుకుని బాగా బీట్ చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో చికెన్ ముక్కలను తీసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ ల కోడిగుడ్డు మిశ్రమాన్ని వేసి కలపాలి. తరువాత ఉప్పు, వెల్లుల్లి తరుగు, మిరియాల పొడి, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి కలపాలి. దీనిని అరగంట పాటు పక్కకు ఉంచిన తరువాత లోతుగా ఉండే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మిగిలిన కోడిగుడ్డు మిశ్రమాన్ని వేసి వేయించాలి. తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత అదే కళాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. తరువాత కొద్దిగా వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు వేసి వేయించాలి. తరువాత చికెన్ ముక్కలు వేసి వేయించాలి.
చికెన్ ముక్కలు మెత్తగా వేగిన తరువాత వెనిగర్, సోయా సాస్ వేసి కలపాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాబేజి తరుము వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత ఉప్పు, మిరియాల పొడి, షెజ్వాన్ సాస్, టమాట కిచప్, గ్రీన్ చిల్లీ సాస్ వేసి కలపాలి. తరువాత నూడుల్స్, ముందుగా వేయించిన కోడిగుడ్లు వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకుని పైన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ నూడుల్స్ తయారవుతాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా ఇంట్లోనే చాలా సులభంగా స్ట్రీట్ స్టైల్ చికెన్ నూడుల్స్ ను తయారు చేసి తీసుకోవచ్చు.