Chicken Pakodi : మనలో చాలా మంది చికెన్ ను ఇష్టంగా తింటూ ఉంటారు. చికెన్ ను తినడం వల్ల శరీరానికి అవసరమయ్యే పోషకాలన్నీ లభిస్తాయి. కండపుష్టికి, దేహదారుఢ్యం కోసం వ్యాయామాలు చేసే వారికి చికెన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. చికెన్ తో మనం వివిధ రకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. చికెన్ తో చేసే వంటకాలలో చికెన్ పకోడీ కూడా ఒకటి. చికెన్ పకోడీ ఎంతో రుచిగా ఉంటుంది. దీనిని చాలా సులువుగా మనం తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ చికెన్ పకోడీని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ పకోడీ తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్నగా కట్ చేసిన బోన్ లెస్ చికెన్ – అర కిలో, కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూన్, శనగ పిండి – ఒక టేబుల్ స్పూన్, మైదా పిండి – ఒక టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్స్, గరం మసాలా – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, మిరియాల పొడి – ఒక టీ స్పూన్, జీడి పప్పు – కొద్దిగా, సన్నగా పొడుగ్గా తరిగిన పచ్చి మిర్చి – 3, కరివేపాకు – రెండు రెబ్బలు, చిన్నగా తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నిమ్మరసం – ఒక టేబుల్ స్పూన్, తరిగిన పుదీనా – కొద్దిగా, పసుపు – పావు టీ స్పూన్, నూనె – డీ ఫ్రై కి సరిపడా.
చికెన్ పకోడీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో చికెన్ ను తీసుకుని శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా చేసుకోవాలి. ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత ఒక టేబుల్ స్పూన్ నూనెను కూడా వేసి కలిపి మూత పెట్టి 20 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. ఇప్పుడు కళాయిలో కొద్ది కొద్దిగా నూనె పోసుకుంటూ చికెన్ ముక్కలను వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ పకోడీ తయారవుతుంది. ఈ చికెన్ పకోడీని నిమ్మరసం, ఉల్లిపాయలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తరచూ చికెన్ తో చేసే వంటకాలకు బదులుగా ఇలా అప్పుడప్పుడూ పకోడీలను చేసుకుని తినడం వల్ల ఎంతో రుచిని ఆస్వాదించవచ్చు.