Maredu Chettu : మారేడు చెట్టు.. ఈ చెట్టు మనందరికీ తెలుసు. ఈ చెట్టుకు ఎంతో విశిష్టత ఉంది. మహా శివుడికి ఎంతో ప్రీతికరమైనది ఈ మారేడు చెట్టు. శివుడికి మారేడు పత్రాలతో పూజ చేస్తే కోరిన కోరికలు తీరుస్తాడని చాలా మంది విశ్వసిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ చెట్టును ఉపయోగించి అనేక వ్యాధుల నుండి బయటపడవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మారేడు చెట్టు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. మారేడు చెట్టు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీనిని సంస్కృతంలో బిల్వ, శ్రీవృక్షం, లక్ష్మీ పత్రా అని, హిందీలో బేల్ అని పిలుస్తూ ఉంటారు. మారేడు వేరు త్రిదోషాలను నయం చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. మారేడు పండు తియ్యగా ఉంటుంది. మారేడు ఆకుల రసాన్ని ఒక టీ స్పూన్ మోతాదులో రెండు పూటలా గోరు వెచ్చగా తీసుకుంటూ ఉంటే వాత, కఫ, పిత్త సంబంధిత దోషాలు, మలబద్దకం, కామెర్ల వ్యాధి క్రమంగా తగ్గిపోతాయి.
మారేడు లేత పిందెలను, ఆవు పాలతో కలిపి మెత్తగా నూరి అందులో చక్కెరను కలిపి రెండు పూటలా తీసుకుంటూ ఉండడం వల్ల మూత్రం ధారాళంగా మంట లేకుండా వస్తుంది. మారేడు పండ్ల గుజ్జును పది గ్రాముల మోతాదులో తీసుకుని దానిని ఒక కప్పు అన్నం వార్చిన నీటిలో కలుపుకుని రెండు పూటలా తాగుతూ ఉంటే గర్భిణీ స్త్రీలలో అయ్యే వాంతులు తగ్గుతాయి. ఈ చెట్టు బెరడును 10 గ్రా. ల మోతాదులో తీసుకుని కడిగి ఒక గ్లాసు నీటిలో వేసి ఒక కప్పు కషాయం అయ్యే వరకు మరిగించి వడకట్టి గోరు వెచ్చగా రెండు పూటలా తాగుతూ ఉంటే మానసిక రుగ్మతలు తగ్గి పిచ్చి చేష్టలు చేయడం మానేస్తారు. మారేడు ఆకులను నీడలో ఎండబెట్టి పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని పూటకు 3 గ్రాముల చొప్పున రెండు పూటలా మంచి నీటితో సేవిస్తూ ఉంటే క్రమంగా కుష్టు వ్యాధి తగ్గుతుంది.
30 గ్రాముల మారేడు ఆకుల రసంలో 3 గ్రాముల మిరియాల పొడిని కలిపి రెండు పూటలా సేవిస్తూ ఉంటే ఉబ్బు రోగం, అండవాపు, మలబద్దకం, కామెర్ల వంటి వ్యాధులు తగ్గుతాయి. మారేడు ఆకులను మెత్తగా నూరి ఒంటికి పట్టించి ఆరిన తరువాత స్నానం చేస్తూ ఉంటే శరీరం నుండి దుర్గంధం రాకుండా ఉంటుంది. 15 మారేడు ఆకులను, 5 మర్రి ఆకులను, 45 తులసి ఆకులను దంచి అర లీటర్ నీటిలో వేసి పావు లీటర్ అయ్యే వరకు మరిగించి వడకట్టాలి. ఈ నీటిని గంట గంటకూ 10 గ్రాముల మోతాదులో తీసుకుంటే ఉంటే టైఫాయిడ్ జ్వరం తగ్గుతుంది.
మారేడు వేర్లను గోమూత్రంతో కలిపి నూరి రసాన్ని తీసి వడకట్టాలి. ఆ రసాన్ని తలకు పట్టించి ఒక గంట తరువాత కంకుడు రసంతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల పేలు తగ్గిపోతాయి. మారేడు బెరడును దంచి దానికి నాలుగు రెట్లు నీళ్లను కలిపి నాలుగో వంతు కషాయం మిగిలే వరకు మరిగించి వడకట్టాలి. ఈ కషాయంతో రోజూ మూడు సార్లు మొలలను తడపడం వల్ల మొలలు హరించుకు పోతాయి. ఈ మొక్క ఆకులను దంచి వస్త్రంలో వేసి ఆ వస్త్రాన్ని కళ్లపై ఉంచి కట్టుగా కట్టాలి. ఇలా తరచూ చేస్తుండడం వల్ల కళ్ల సమస్యలు తగ్గుతాయి. ఈ విధంగా మారేడు చెట్టును ఉపయోగించి మనకు వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.