Chilli Idli : మనం అల్పాహారంగా ఇడ్లీలను తీసుకుంటూ ఉంటాము. ఇడ్లీలను చాలా మంది ఇష్టంగా తింటారు. సాంబార్, చట్నీతో తింటే ఇవి చాలా రుచిగా ఉంటాయి. అయితే ఒక్కోసారి ఇడ్లీలు ఎక్కువగా మిగిలి పోతూ ఉంటాయి. ఇలా మిగిలిన ఇడ్లీలను పడేయకుండా వాటితో చిల్లీ ఇడ్లీని కూడా తయారు చేసుకోవచ్చు. స్నాక్స్ గా తీసుకోవడానికి ఈ చిల్లీ ఇడ్లీలు చాలా చక్కగా ఉంటాయి. ఇడ్లీలను తినని వారు కూడా ఈ చిల్లీ ఇడ్లీని ఇష్టంగా తింటారు. ఇడ్లీలతో మరింత రుచిగా చిల్లీ ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చిల్లీ ఇడ్లీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఇడ్లీలు – 4, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, చిన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు – 2, అల్లం తరుగు – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, క్యూబ్స్ లాగా తరిగిన క్యాప్సికం – 1, క్యూబ్స్ లాగా తరిగిన ఉల్లిపాయ – 1, రెడ్ చిల్లీ సాస్ – ఒక టీ స్పూన్, లైట్ సోయా సాస్ – ఒక టీ స్పూన్, వెనిగర్ – అర టీస్పూన్, టమాట కిచప్ – ఒక టీ స్పూన్, ఉప్పు – కొద్దిగా.
చిల్లీ ఇడ్లీ తయారీ విధానం..
ముందుగా ఇడ్లీలను ముక్కలుగా చేసుకోవాలి. తరువాత వీటిని వేడి నూనెలో వేసి వేయించాలి. వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత మరో కళాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. తరువాత వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత క్యాప్సికం, ఉల్లిపాయ క్యూబ్స్ వేసి వేయించాలి. వీటిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత సోయా సాస్, వెనిగర్, టమాట కిచప్ వేసి కలపాలి. వీటిని దగ్గర పడే వరకు పెద్ద మంటపై వేయించిన తరువాత ఫ్రై చేసుకున్న ఇడ్లీ ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. సాసెస్ అన్నీ ముక్కలకు పట్టే వరకు టాస్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చిల్లీ ఇడ్లీ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.