Snoring : ప్రస్తుత తరుణంలో చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్యల్లో గురక కూడా ఒకటి. చాలా మంది రాత్రి నిద్ర సమయంలో గురక పెడుతుంటారు. ఇక కొందరు పగటి పూట నిద్రించినా కూడా గురక పెడుతుంటారు. గురక అనేది చాలా మందికి సర్వసాధారణం అయిపోయింది. గురక అనేది సాధారణ సమస్యే అయినప్పటికీ దీర్ఘకాలికంగా దీంతో బాధపడేవారికి భవిష్యత్తులో సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. గురక సమస్య ఉన్నవారికి భవిష్యత్తులో మూర్ఛ వచ్చే చాన్స్ ఉంటుందని అంటున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయాలను సైంటిస్టులు తమ తాజా అధ్యయనంలోనూ వెల్లడించారు.
సాధారణంగా ఎవరికైనా సరే మూర్ఛ వచ్చేందుకు పలు కారణాలు ఉంటాయి. వాటిల్లో పక్షవాతం, అధిక రక్తపోటు, మెదడులో కణతులు వంటివి కొన్ని అని చెప్పవచ్చు. అయితే ఈ అంశాలతోపాటు గురకను కూడా చేర్చారు. అంటే గురక పెట్టేవారికి కూడా మూర్ఛ వచ్చే అవకాశం ఉంటుందట. అందుకు కారణాన్ని కూడా సైంటిస్టులు వెల్లడించారు. నిద్రపోతున్నప్పుడు గొంతులో అడ్డు పడినట్లుగా ఉంటే గురక వస్తుంది. దీంతో శ్వాస సరిగ్గా ఆడదు. ఫలితంగా మెదడులో రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గుతుంది. అయితే దీర్ఘకాలికంగా ఇలా జరిగితే ఫలితంగా మెదడు పనితీరు మందగిస్తుంది. దీంతో మూర్ఛ వస్తుంది.
కనుక గురక సమస్య ఉన్నవారు వెంటనే దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. గురక వచ్చేందుకు పలు కారణాలు ఉంటాయి. అధికంగా బరువు ఉండడం, వెల్లకిలా పడుకోవడం, మద్యం ఎక్కువగా సేవించడం, పొగ తాగడం వంటి కారణాల వల్ల గురక ఇబ్బంది పెడుతుంది. అయితే రోజూ వ్యాయామం చేయడం, మెడిటేషన్, శ్వాస క్రియలు వంటివి చేస్తే గురక నుంచి బయట పడవచ్చు. అలాగే నిద్రించేటప్పుడు ఏదైనా ఒక పక్కకి తిరిగి పడుకోవాలి. చాలా మందికి వెల్లకిలా పడుకోవడం వల్లనే గురక వస్తుంది. కనుక ఇలా చేయకూడదు. ఈ విధంగా సూచనలు పాటిస్తే గురక తగ్గుతుంది. ఫలితంగా భవిష్యత్తులో మూర్ఛ రాకుండా చూసుకోవచ్చు.