Chitti Budagalu : చిట్టి బుడగలు.. బియ్యంపిండితో చేసే ఈ బుడగలు చాలా చిన్నగా రుచిగా ఉంటాయి. క్రిస్పీగా, రుచిగా ఉండే ఈ చిట్టి బుడగలను ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. చిట్టి బుడగలను తయారు చేయడం చాలా సులభం. ఎవరైనా చాలా తేలికగా, చాలా తక్కువ సమయంలో వీటిని తయారు చేసుకోవచ్చని చెప్పవచ్చు. పిల్లలకు బయట లభించే చిరుతిళ్లను కొనివ్వడానికి బదులుగా ఇలా చిట్టి బుడగలను చేసి ఇవ్వడం వల్ల వారి ఆరోగ్యం పాడవకుండా ఉంటుంది. క్రిస్పీగా, రుచిగా, సులభంగా చిట్టి చెక్కలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చిట్టి బుడగల తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం పిండి – ఒకటిన్నర కప్పు, మైదాపిండి – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన కరివేపాకు – రెండు రెమ్మలు, గంట పాటు నానబెట్టిన పెసరపప్పు – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, బటర్ లేదా వేడి నూనె – 2 టేబుల్ స్పూన్స్, వేడి నీళ్లు – తగినన్ని, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
చిట్టి బుడగల తయారీ విధానం..
ముందుగా గిన్నెలో బియ్యంపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో మైదాపిండి వేసి కలపాలి. తరువాత మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక పాలిథిన్ కవర్ మీద ఈ ఉండలను ఉంచి వాటిపై నుండి మరో పాలిథిన్ కవర్ ను ఉంచాలి. తరువాత తరువాత గ్లాస్ తో చెక్కలుగా వత్తుకోవాలి.
లేదంటే పూరీ ప్రెస్ తో కూడా చెక్కలను వత్తుకోవచ్చు. ఇలా అన్నింటిని వత్తుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చెక్కలను వేసి కాల్చుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చిట్టి బుడగలు తయారవుతాయి. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల 20 రోజులకు పైగా నిల్వ ఉంటాయి. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి.