Nei Payasam : నెయ్ పాయసం.. కేరళ వంటకమైనా ఈ పాయసం ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. అలాగే ఇది మస పాయసంలా మెత్తగా ఉండదు. తింటూ ఉంటే పలుకులు తగులుతూ చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ పాయసాన్ని మట్టా రైస్ తో తయారు చేస్తారు. ఈ మట్టా రైస్ ఉంటే చాలు మనం కూడా ఈ పాయసాన్ని చిటికెలో తయారు చేసుకోవచ్చు. అలాగే దీనిని తయారు చేయడానికి పాలు, పంచదార అవసరమే ఉండవు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ మట్టా పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నెయ్ పాయసం తయారీకి కావల్సిన పదార్థాలు..
మట్టా రైస్ – ఒక కప్పు, తాటి బెల్లం – 2 కప్పులు, నీళ్లు – ఒక కప్పు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్, డ్రై ఫ్రూట్స్ – తగినన్ని, పచ్చి కొబ్బరి ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, వేడి నీళ్లు – 5 కప్పులు, శొంఠి పొడి -అర టీ స్పూన్, యాలకుల పొడి -అర టీ స్పూన్.
నెయ్ పాయసం తయారీ విధానం..
ముందుగా రైస్ ను శుభ్రంగా కడిగి నీళ్లు వంపేసి పక్కకు ఉంచాలి. తరువాత బెల్లం తురుమును, నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగిన తరరువాత స్టవ్ ఆఫ్ చేసి వడకట్టి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత పచ్చి కొబ్బరి ముక్కలు వేసి వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో మరికొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత కడిగి పక్కకు ఉంచిన బియ్యం వేసి వేయించాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత మరుగుతున్న వేడి నీళ్లు పోసి కలపాలి. అన్నం ఉడుకుపట్టిన తరువాత మూత పెట్టి మంటను చిన్నగా చేయాలి.
దీనిని 30 నిమిషాల పాటు ఉడికించిన తరువాత ముందుగా తయారు చేసుకున్న బెల్లం నీళ్లు, మరో 3 టీ స్పూన్ల నెయ్యి వేసి కలపాలి. తరువాత పూర్తిగా దగ్గర పడే వరకు మూత పెట్టి ఉడికించాలి. పాయసం దగ్గర పడిన తరువాత వేయించిన డ్రై ఫ్రూట్స్, కొబ్బరి ముక్కలు వేసి కలపాలి. తరువాత శొంఠి పొడి, యాలకుల పొడి వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని అలాగే 10 నిమిషాల పాటు ఉంచి ఆ తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే నెయ్ పాయసం తయారవుతుంది. దీనిని తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.