Cloves Kashayam : వర్షాకాలం వచ్చిందంటే చాలు మనలో చాలా మంది జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి ఇన్ఫెక్షన్ ల బారిన పడుతూ ఉంటారు. వీటి వల్ల కలిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. వయసుతో సంబంధం లేకుండా అందరిని ఈ సమస్యలు ఎంతగానో వేధిస్తూ ఉంటాయి. వాతావరణ మార్పులే ఈ సమస్యలు రావడానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని పొందడానికి యాంటీ బయాటిక్స్, దగ్గు సిరప్ లు, ఇతర రకాల మందులను వాడుతూ ఉంటారు. మందులు వాడినప్పటికి దగ్గు, జలుబు వంటి సమస్యలు వారం రోజుల పాటు వేధించకుండా మాత్రం తగ్గవు.
మందులు వాడడానికి బదులుగా మన వంటింట్లో దినుసులను ఉపయోగించి కషాయాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల కూడా మనం జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి బయటపడవచ్చు. అలాగే ఈ కషాయాన్ని తాగడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది. ఈ కషాయాన్ని తయారు చేసుకోవడం చాలా సులభం. అలాగే దీనిని తాగడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. పైగా మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలను తగ్గించే ఈ కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కషాయాన్ని తయారు చేసుకోవడానికి గానూ మనం ముందుగా ఒక పొడిని తయారు చేసుకోవాలి.
దీని కోసం ఒక జార్ లో ఒక టీ స్పూన్ ధనియాలు, అర టీ స్పూన్ వాము, అరటీ స్పూన్ జీలకర్ర, యాలకులు మూడు, ఐదు మిరియాలు, ఒక దాల్చిన చెక్క ముక్క, అర టీ స్పూన్ శొంఠి పొడి, ఐదు లవంగాలు వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని గాజు సీసాలో వేసి గాలి తగలకుండా నిల్వ చేసుకోవాలి. ఇప్పుడు కషాయాన్ని తయారు చేసుకోవడానికి గానూ ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీళ్లు పోసి అందులో ఈ పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో వేసి మరిగించాలి. ఇలా 5 నుండి 8 నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఈ కషాయం గోరు వెచ్చగా అయిన తరువాత వడకట్టి తాగాలి. ఇలా తాగడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. ఆస్థమా ఉన్న వారు కూడా ఈ పొడిని వాడవచ్చు. ఇలా కషాయాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి వాతావరణ మార్పుల కారణంగా వచ్చే అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. ఈ విధంగా కషాయాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యల నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది.