Coconut Halwa : మనం వంటల తయారీలో భాగంగా అప్పుడప్పుడు పచ్చి కొబ్బరిని కూడా ఉపయోగిస్తూ ఉంటాం. పచ్చి కొబ్బరిని కూడా మనం ఆహారంలో భాగంగా తీసుకుంటాం. దీనిని నేరుగా తినడమో లేదా తీపి పదార్థాల తయారీలో ఉపయోగించడమో చేస్తూ ఉంటాం. అంతేకాకుండా ఈ పచ్చి కొబ్బరితో మనం ఎంతో రుచిగా ఉండే కొబ్బరి హల్వాను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ హల్వాను వంట చేయడం రాని వారు కూడా చాలా సులభంగా తయారు చేయవచ్చు. పచ్చి కొబ్బరితో హల్వాను ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చి కొబ్బరి హల్వా తయారీకి కావల్సిన పదార్థాలు..
కొబ్బరి కాయ – 1, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, పాలు – ఒక కప్పు, పంచదార – అర కప్పు లేదా తగినంత, ఎల్లో ఫుడ్ కలర్ – చిటికెడు, కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూన్, యాలకుల పొడి – అర టీ స్పూన్.
పచ్చి కొబ్బరి హల్వా తయారీ విధానం..
ముందుగా కొబ్బరి కాయ నుండి కొబ్బరిని వేరు చేయాలి. తరువాత కొబ్బరిపై ఉండే నల్లటి భాగాన్ని తీసేసి ముక్కలుగా చేసుకోవాలి. తరువాత ఈ ముక్కలను జార్ లో వేసి వీలైనంత మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నెయ్యి వేసి నెయ్యి వేడయ్యాక ముందుగా సిద్దం చేసుకున్న కొబ్బరి తురుమును వేసి చిన్న మంటపై 5 నిమిషాల పాటు వేయించుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో పాలను పోసి పాలు పొంగు వచ్చే వరకు వేడి చేయాలి. పాలు వేడయ్యాక పంచదారను వేయాలి.
పంచదార పూర్తిగా కరిగిన తరువాత అందులో ఫుడ్ కలర్ ను వేసి కలపాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్ ను తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి ఉండలు లేకుండా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కార్న్ ఫ్లోర్ నీటిని పాలల్లో వేసి కలిపి కొద్దిగా దగ్గర పడే వరకు వేడి చేయాలి. పాలు దగ్గర పడిన తరువాత యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించిన కొబ్బరి తురుమును వేసి అంతా కలిసేలా కలపాలి.
ఈ మిశ్రమం నుండి నెయ్యి వేరయ్యే వరకు కలుపుతూ వేయించాలి. చివరగా మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కమ్మటి రుచి ఉండే కొబ్బరి హల్వా తయారవుతుంది. ఈ హల్వాను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. తీపి తినాలనిపించినప్పుడు త్వరగా అయ్యేలా ఇలా పచ్చి కొబ్బరితో హల్వాను తయారు చేసుకుని తినవచ్చు.