Crispy Butter Scotch Rolls : బేక‌రీల‌లో ల‌భించే ఈ స్నాక్స్‌ను ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు.. ఎంతో టేస్టీగా ఉంటాయి..!

Crispy Butter Scotch Rolls : బ‌ట‌ర్ స్కాట్చ్ రోల్స్.. పంచ‌దారతో చేసే ఈ రోల్స్ చాలా రుచిగా ఉంటాయి. ఆలా క్రిస్పీగా కూడా ఉంటాయి. వీటిని పిల్ల‌లు ఎంతో ఇష్టంగా తింటార‌ని చెప్ప‌వ‌చ్చు. వీటిని ఒక‌సారి త‌యారు చేసి పెట్టుకుంటే వారం రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. వెరైటీ రుచులు కోరుకునే వారు వీటిని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ బ‌ట‌ర్ స్కాట్చ్ రోల్స్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

క్రిస్పీ బ‌ట‌ర్ స్కాట్చ్ రోల్స్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పంచ‌దార – 200 గ్రా., బ‌ట‌ర్ – ఒక టేబుల్ స్పూన్, జీడిపప్పు ప‌లుకులు – 2 టేబుల్ స్పూన్స్, బాదంపప్పు ప‌లుకులు – 2 టేబుల్ స్పూన్స్, ఎండుద్రాక్ష త‌రుగు- 2 టేబుల్ స్పూన్స్, ఎండు కొబ్బ‌రి ముక్క‌ల త‌రుగు – 2 టేబుల్ స్పూన్స్, పిస్తా ప‌లుకులు – 2 టేబుల్ స్పూన్స్, స్ప్రింగ్ రోల్స్ షీట్స్ – త‌గిన‌న్ని, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Crispy Butter Scotch Rolls recipe make in this method
Crispy Butter Scotch Rolls

క్రిస్పీ బ‌ట‌ర్ స్కాట్చ్ రోల్స్ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో పంచ‌దార వేసి క‌ద‌ప‌కుండా వేడి చేయాలి. పంచ‌దార క‌ర‌గ‌డం మొద‌లు పెట్టిన త‌రువాత మ‌ధ్య‌స్థ మంట‌పై క‌లుపుతూ క‌రిగించాలి. పంచ‌దార స‌గానికి పైగా క‌రిగిన త‌రువాత బ‌ర‌ట్ వేసి క‌ల‌పాలి. పంచ‌దార క‌రిగి చిక్క‌టి గోల్డెన్ సాస్ లాగా అయిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి వెంట‌నే దీనిని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని స‌మానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. త‌రువాత డ్రై ఫ్రూట్స్ ప‌లుకులు, ఎండుకొబ్బ‌రి ముక్క‌లు వేసి చ‌ల్లార‌నివ్వాలి. పంచ‌దార మిశ్ర‌మం పూర్తిగా చ‌ల్లారిన త‌రువాత చిన్న చిన్న ముక్క‌లుగా చేసుకోవాలి. త‌రువాత చ‌పాతీ క‌ర్ర‌తో మోతీచూర్ బూందీ మాదిరి చిన్న‌గా పొడి పొడి అయ్యేలా వ‌త్తుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత స్ప్రింగ్ రోల్స్ షీట్ ను తీసుకుని దానిని 4 స‌మాన భాగాలుగా క‌ట్ చేసుకోవాలి.

త‌రువాత ఒక్కో ముక్క‌ను తీసుకుని దానికి ఒక చివ‌ర‌నా పంచ‌దార మిశ్ర‌మాన్ని ఉంచి అంచుల‌ను లోప‌లికి మ‌డుస్తూ రోల్ చేసుకోవాలి. అంచులు ఊడిపోకుండా చివ‌ర‌గా మైదాపిండి పేస్ట్ రాసి రోల్ చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని త‌యారు చేసుకున్న త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక రోల్స్ ను వేసి కాల్చుకోవాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై లైట్ గోల్డెన్ క‌ల‌ర్ వ‌చ్చే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క్రిస్పీ బ‌ట‌ర్ స్కాట్చ్ రోల్స్ త‌యార‌వుతాయి. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా అప్ప‌టిక‌ప్పుడు బ‌ట‌ర్ స్కాట్చ్ రోల్స్ ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు.

Share
D

Recent Posts