Crispy Chicken Pakoda : చికెన్ ను మనలో చాలా మంది ఇష్టంగా తింటారు. చికెన్ తో బిర్యానీ, కూర, ఫ్రై వంటివే కాకుండా చికెన్ పకోడిని కూడా తయారు చేస్తూ ఉంటాం. చికెన్ పకోడి చాలా రుచిగా ఉంటుంది. ఈ చికెన్ పకోడి మనకు బయట రోడ్డు పక్కన బండ్ల మీద కూడా దొరుకుతూ ఉంటుంది. బయట లభించే విధంగా అదే రుచితో ఇంట్లో కూడా మనం ఈ చికెన్ పకోడిని తయారు చేసుకోవచ్చు. స్ట్రీట్ స్టైల్ లో చికెన్ పకోడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ పకోడి తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ – అరకిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, నిమ్మరసం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – 2 టీ స్పూన్స్, గరం మసాలా – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, తరిగిన కరివేపాకు – రెండు రెమ్మలు, తరిగిన కొత్తిమీర – రెండు టేబుల్ స్పూన్స్, బియ్యంపిండి – 2 టీ స్పూన్స్, శనగపిండి – 2 టీ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
చికెన్ పకోడి తయారీ విధానం..
ముందుగా చికెన్ శుభ్రంగా కడిగి ఉప్పు నీటిలో వేసి అరగంట పాటు ఉంచాలి. తరువాత ఈ చికెన్ ను నీళ్లు లేకుండా వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం పేస్ట్, నిమ్మరసం, ఉప్పు, కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలపాలి. తరువాత శనగపిండి, బియ్యం పిండి వేసి బాగా కలపాలి. ఈ చికెన్ ఒక గంట పాటు ఫ్రిజ్ లో ఉంచి మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత చికెన్ ను బయటకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చికెన్ ముక్కలను వేసి వేయించుకోవాలి.
వీటిని మధ్యస్థ మంటపై గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తరువాత వీటిని టిష్యూ పేపర్ ఉంచిన ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడి తయారవుతుంది. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా లేదా పప్పు, సాంబార్ వంటి వాటితో కలిపి ఈ చికెన్ పకోడిని తినవచ్చు. అందరూ ఈ చికెన్ పకోడిని ఇష్టంగా తింటారు.