Dibba Rotti : మన అమ్మమ్మల కాలంలో చేసిన అల్పాహారాల్లో దిబ్బ రొట్టె ఒకటి. మినపప్పు ఉపయోగించి చేసే ఈ దిబ్బ రొట్టెను తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో బలం కలుగుతుంది. దిబ్బ రొట్టెను చట్నీలతో కాకుండా తేనె పానకంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. కానీ ప్రస్తుతయ కాలంలో వీటిని తయారు చేసి తీసుకునే వారు చాలా తక్కువగా ఉన్నారు. ఆరోగ్యానికి మేలు చేసే ఈ దిబ్బ రొట్టెలను, తేనె పానకాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
దిబ్బరొట్టె, తేనె పాకం తయారీకి కావల్సిన పదార్థాలు..
పొట్టు మినపప్పు – ఒక కప్పు, బియ్యం నూక – ఒకటిన్నర కప్పు, ఉప్పు – తగినంత, జీలకర్ర – అర టీ స్పూన్.
తేనెపానకం తయారీకి కావల్సిన పదార్థాలు..
బెల్లం తురుము – అర కప్పు, నీళ్లు – పావు కప్పు, కచ్చా పచ్చాగా దంచిన సోంపు గింజలు – ఒక టీ స్పూన్.
దిబ్బరొట్టె, తేనెపాకం తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మినపప్పును తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత మరో గిన్నెలో బియ్యం నూకను తీసుకుని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి దీనిని కూడా నాలుగు గంటల పాటు నానబెట్టాలి. తరువాత మినపప్పును శుభ్రంగా కడిగి జార్ లో వేసుకోవాలి. దీనిలో కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దిబ్బ రొట్టెకు పిండి గట్టిగా ఉండేలా చూసుకోవాలి. తరువాత ఈ పిండిలో ఉప్పు, జీలకర్ర వేసి కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అడుగు భాగం మందంగా ఉండే కళాయిని తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె, నెయ్యి లేదా వెన్నను వేసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక కళాయిలో 5 లేదా 6 గంటెల పిండిని వేయాలి. తరువాత దీనిపై గాలి బయటకు పోకుండా ఉండే మూతను ఉంచి మధ్యస్థ మంటపై 15 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత ఈ దిబ్బ రొట్టెను మరో వైపుకు తిప్పాలి. ఇప్పుడు రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నూనెను వేసి మరో 5 నుండి 10 నిమిషాల పాటు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల దిబ్బ రొట్టె తయారవుతుంది. ఇప్పుడు తేనె పానకాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఒక కళాయిలో బెల్లం తురుము, నీళ్లు పోసి వేడి చేయాలి.
ఇందులోనే సోంపు గింజలను కూడా వేసి బెల్లం కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. బెల్లం కరిగిన తరువాత దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దీనిని వడకట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల తేనె పానకం తయారవుతుంది. ఇలా దిబ్బ రొట్టెను, తేనె పానకాన్ని తయారుచేసుకుని కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. దిబ్బరొట్టెను తయారు చేసుకోవడానికి పిండిని పులియబెట్టాల్సిన పని లేదు. ఈ పిండిని రాత్రే మిక్సీ పట్టుకుని ఫ్రిజ్ లో ఉంచాలి. ఉదయాన్నే ఇందులో ఉప్పు, జీలకర్ర వేసి దిబ్బ రొట్టె వేసుకోవాలి. ఉదయం అల్ఫాహారంగా ఈ దిబ్బ రొట్టెను చేసుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.