ఫేస్‌బుక్.. ఇప్పుడు సామాన్య ప్రజలకు కూడా అత్యంత చేరువ అయింది. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి మళ్లీ నిద్రించే వరకు ఫేస్‌బుక్ ప్రపంచంలో విహరిస్తున్నారు. ఎక్కడ ఏ సందర్భంలో ఏ ప్రదేశంలో ఉన్నా స్టేటస్ అప్‌డేట్లను పెడుతున్నారు. పోస్టులకు లైక్‌లు, కామెంట్లు తెప్పించుకుంటున్నారు. అయితే ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఫేస్‌బుక్‌లో మీరు షేర్ చేసే కొన్ని పోస్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అవేమిటో, వాటి వల్ల మనకు ఏవిధంగా హాని కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందామా.
1. బర్త్ డే
బర్త్ డే చేసుకోవడం దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఫేస్‌బుక్‌లో పెట్టడం కామన్ అయిపోయింది. అయితే నిజానికి ఇలాంటి పోస్టులు పెడితే మీ బర్త్ డే తేదీ వివరాలు ఇతరులకు తెలుస్తాయి. దీంతో వారు ఆ వివరాలను ఉపయోగించి బ్యాంక్ లేదా క్రెడిట్, డెబిట్ కార్డుల సమాచారాన్ని ఈజీగా ట్రేస్ చేస్తారు. కనుక ఇలాంటి పోస్టులను పెట్టకూడదు. పెట్టి ఉంటే వెంటనే డిలీట్ చేయండి.
2. ఫోన్ నంబర్
ఫోన్ నంబర్‌ను ఫేస్‌బుక్‌లో అందరికీ తెలిసేలా పబ్లిగ్గా షేర్ చేయరాదు. అలా చేస్తే మీ ఫోన్ నంబర్‌ను ఎవరైనా దుర్వినియోగం చేసేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నేటి తరుణంలో చాలా వరకు ఆర్థిక లావాదేవీలు కేవలం ఫోన్ నంబర్ల ద్వారానే జరుగుతున్నాయి. కనుక ఫోన్ నంబర్‌ను ఇతరులకు తెలిపే విషయంలో గోప్యత పాటించాలి. మీకు తెలిసిన వారికి తప్ప ఇతరులకు ఆ నంబర్‌ను షేర్ చేయరాదు.
3. తెలియని వ్యక్తులు
ఫేస్‌బుక్‌లో మీకు తెలియని వ్యక్తులను ఫ్రెండ్స్‌గా చేసుకోరాదు. ఎందుకంటే వారు మంచి వారు అయితే ఓకే, లేదంటే మీ సమాచారం వారి చేతుల్లోకి వెళ్తుంది. ఫలితంగా వారు మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయవచ్చు. లేదంటే మీ సమాచారంతో మీ బ్యాంక్ వివరాలను సేకరించి డబ్బు దోపిడీ చేయవచ్చు.
4. పిల్లల ఫొటోలు
మీ పిల్లల ఫొటోలను ఫేస్‌బుక్‌లో ఎట్టి పరిస్థితిలో షేర్ చేయకండి. ఎందుకంటే వారి పేరిట దుండగులు నకిలీ అకౌంట్లను ఓపెన్ చేసి తరువాత మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయవచ్చు.
5. పిల్లల వివరాలు
మీ పిల్లల వివరాలు, వారు ఎక్కడ చదువుతున్నది, ఎక్కడ ఉంటున్నది తదితర వివరాలను కూడా ఫేస్‌బుక్ లో షేర్ చేయరాదు. చేస్తే వారిని కిడ్నాప్ చేసేందుకు అవకాశం ఉంటుంది. లేదంటే వారికి ఇతర ఏ రకంగా అయినా ఇతరులు హాని కలిగించవచ్చు.
6. లొకేషన్ సర్వీసులు
మీరు ఎక్కడికి వెళ్తుంది ఫేస్‌బుక్‌లో లొకేషన్ షేర్ చేయకండి. అలా చేస్తే మీరు లేని సమయం చూసి మీ ఇంట్లో ఎవరైనా దొంగతనం చేయవచ్చు.
7. ఆఫీస్
ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులు ఫేస్‌బుక్ ను వాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆఫీస్‌కు సంబంధించిన వివరాలను వీలైనంత వరకు షేర్ చేయరాదు. అలాగే ఉన్నతాధికారులను కించ పరిచేలా పోస్టులు పెట్టరాదు. అలాంటి పోస్టులను లైక్ చేయరాదు. చేస్తే అది మీకు నష్టం కలిగించవచ్చు.
8. లొకేషన్ టాగింగ్
మీరు ఎక్కడికి వెళ్లినా ఆ లొకేషన్‌ను ఫేస్‌బుక్‌లో షేర్ చేయకండి. అలాగే దాన్ని ఇతర ఫ్రెండ్స్‌కు కూడా అస్సలు టాగింగ్ చేయకండి. చేస్తే మీ లొకేషన్ వివరాలు అందరికీ తెలుస్తాయి. దీంతో మీరు ఏం చేస్తుందీ ఇట్టే తెలిసిపోతుంది. ఫలితంగా మీకు ఇబ్బందులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
9. క్రెడిట్, డెబిట్ కార్డు, బ్యాంక్ వివరాలు
మీకు సంబంధించిన క్రెడిట్, డెబిట్ కార్డు, బ్యాంకుల వివరాలను ఫేస్‌బుక్‌లో షేర్ చేయకండి. చేస్తే హ్యాకర్ల చేతుల్లోకి ఆ వివరాలు వెళ్తాయి. ఫలితంగా మీ అకౌంట్లలో ఉన్న సొమ్ము మాయమవుతుంది.