ఆధ్యాత్మికం

ప్ర‌పంచ‌వ్యాప్తంగా శ్రీ‌కృష్ణుడికి చెందిన ప్ర‌ముఖ ఆల‌యాలు ఇవి తెలుసా..!

శ్రీ‌కృష్ణుడు.. శ్రీ‌మ‌హా విష్ణువు అవ‌తారాల్లో ఒక అవ‌తారం. ద్వాప‌ర యుగంలో కృష్ణుడు ద్వార‌క‌ను ఏలాడు. మ‌హాభార‌తంలో పాండ‌వుల ప‌క్షాన నిలిచి ధ‌ర్మాన్ని గెలిపించాడు. హిందూ పురాణాల‌తోపాటు అనేక గ్రంథాలు, క‌థల్లో శ్రీకృష్ణుని గురించి అనేక విధాలుగా చెప్పారు. చిలిపి బాలునిగా ఆయ‌న చేసిన లీల‌లు, ప‌శువుల కాప‌రిగా, గోపిక‌ల‌కు ప్రాణ‌నాథుడిగా, యాద‌వ రాజుగా అనేక విధాలుగా కృష్ణున్ని వ‌ర్ణించారు. అయితే ఎలా చెప్పినా కృష్ణున్ని గొప్ప దైవంగా భావించి భ‌క్తులు పూజ‌లు చేస్తారు. ఆయ‌న‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఆల‌యాలు కూడా ఉన్నాయి. మ‌న దేశంలో కృష్ణునికి చెందిన ప్ర‌ముఖ ఆల‌యాలు ఉన్నాయి. మ‌రి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందామా.

1. ద్వార‌కాదిష్ ఆల‌యం, గుజ‌రాత్

ఈ కృష్ణుని ఆల‌యాన్ని చాళుక్యులు నిర్మించారు. అద్భుత‌మైన శిల్పాలు, కళా నైపుణ్యం ఈ ఆల‌యంలో కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తుంది. గ్రానైట్‌, లైమ్ స్టోన్ వంటి రాళ్ల‌ను వాడి అప్ప‌ట్లోనే అద్భుతంగా ఈ ఆల‌యాన్ని నిర్మించారు. ఆల‌య గోడ‌ల‌పై నృత్య‌కారులు, ఏనుగులు, సంగీత‌కారుల బొమ్మ‌లు చాలా ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తాయి. గుజ‌రాత్ లోని గోమ్‌తి క్రీక్ అనే ప్రాంతంలో ఈ ఆల‌యం ఉంది.

2. బాల‌కృష్ణ ఆల‌యం, హంపి, క‌ర్ణాట‌క

హంపిలో ఉన్న ఈ కృష్ణుని ఆల‌యాన్ని చేరుకోవాలంటే కొద్దిగా క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది. తీరా ఆల‌యానికి చేరుకున్నాక పెద్ద‌గా అల‌స‌ట అనిపించ‌దు. ఎందుకంటే ఈ ఆల‌య శిల్ప సంప‌ద అలాంటిది మ‌రి. ఒక్క‌సారి చూపు ప‌డితే అలానే చూస్తూ ఉండిపోతారు. అంత‌టి అద్భుతంగా ఈ ఆల‌యం గోచ‌రిస్తుంది. యునెస్కో ఈ ఆల‌యాన్ని ప్ర‌పంచ వార‌సత్వ సంప‌ద జాబితాలో చేర్చింది.

these are the famous temples in the world for sri krishna

3. ఇస్కాన్ టెంపుల్‌, బెంగ‌ళూరు

దేశంలోనే ఈ ఆల‌యం అతి పెద్ద శ్రీ‌కృష్ణుని ఆల‌యంగా పేరుగాంచింది. దీన్ని ISKCON వారు 1997లో నిర్మించారు. వైకుంఠ హిల్స్ మీద ఈ ఆల‌యాన్ని నిర్మించారు. ఈ ఆల‌య ప్రాంగ‌ణంలో బంగారు పూత‌తో ఓ జెండా ఉంటుంది. ప‌క్క‌నే క‌లశ శిఖ‌రం ఉంటుంది. రెండూ చూడ‌ద‌గిన‌వే.

4. ఇస్కాన్ టెంపుల్‌, బృందావ‌న్‌, ఉత్త‌ర ప్ర‌దేశ్

ఈ ఆల‌యాన్ని మధుర కృష్ణ బ‌ల‌రాం మందిర్ అని కూడా పిలుస్తారు. 1975లో ఈ ఆల‌యాన్ని నిర్మించారు. ఆల‌య గోడ‌ల‌పై అద్భుత‌మైన శిల్పాలు చెక్క‌బ‌డి ఉంటాయి.

5. జ‌గ‌న్నాథ్ ఆల‌యం, పూరీ, ఒడిశా

దేశంలో ఉన్న పూరీ జ‌గ‌న్నాథ్ ఆల‌యానికి చాలా ప్ర‌త్యేక‌త ఉంది. ఇక్క‌డ జ‌రిగే ఉత్స‌వాల‌ను చూసేందుకు భ‌క్తులు పెద్ద ఎత్తున వ‌స్తారు. కొన్ని కోట్ల మంది భ‌క్తులు ఈ ఆల‌యాన్ని ఏటా ద‌ర్శించుకుంటారు.

6. ప్రేమ్ మందిర్‌, బృందావ‌న్

రాత్రిపూట ఈ ఆల‌యంలో చేసే దీపాలంక‌ర‌ణ చాలా అద్భుతంగా ఉంటుంది. కృష్ణుని ముఖ్య‌మైన ఆల‌యాల్లో ఈ ఆల‌యం కూడా ఒక‌టి. చాలా మంది ఇక్క‌డికి వ‌చ్చి కృష్ణున్ని ద‌ర్శించుకుంటారు.

7. శ్రీ‌శ్రీ రాధాకృష్ణా ఆల‌యం, ఉతాహ్, యునైటెడ్ స్టేట్స్

అమెరికాలోఉన్న ఉతాహ్‌లో ఉన్న ఈ ఆల‌యం అక్క‌డ చాలా ప్ర‌సిద్ధిగాంచింది. అక్క‌డ స్థానికంగా ఉన్న హిందువులు క‌లిసి ఈ కృష్ణుని ఆల‌యాన్ని నిర్మించుకున్నారు. అక్క‌డ ఏటా అనేక పండుగ‌ల‌ను నిర్వ‌హిస్తారు. హోలీ, శ్రీ‌కృష్ణాష్ట‌మి వంటివి వైభ‌వంగా జ‌రుగుతాయి.

8. వెంక‌టేశ్వ‌ర ఆల‌యం

శ్రీ‌కృష్ణుని ఆల‌యం కాకపోయిన‌ప్ప‌టికీ ఈ ఆల‌యంలో కూడా భ‌క్తులు ప్రాంగ‌ణంలో ఉన్న కృష్ణుని విగ్ర‌హాన్ని పూజిస్తారు. యూకేలో ఉన్న అతి పెద్ద ఆల‌యాల్లో ఇదొక‌టి. 30 ఎక‌రాల స్థ‌లంలో నిర్మించారు.

9. గురువాయుర్ టెంపుల్‌, గురువాయూర్‌, కేర‌ళ‌

ద‌క్షిణ భార‌తదేశంలో ఉన్న అత్యంత సుంద‌ర‌మైన ఆల‌యాల్లో ఈ ఆల‌యం కూడా ఒక‌టి. ద‌క్షిణ ద్వారక అని ఈ ఆల‌యాన్ని భ‌క్తులు పిలుస్తారు. 1638వ సంవ‌త్స‌రంలో ఈ ఆల‌యాన్ని నిర్మించిన‌ట్టు చ‌రిత్ర చెబుతోంది. శ్రీ‌కృష్ణుడు కొలువై ఉన్న ఈ ఆల‌యంలో ఆయన విగ్ర‌హం మెడ‌లో తుల‌సి ఆకుల మాల‌, ముత్యాల హారం ఉంటాయి.

Admin

Recent Posts