Dondakaya Shanagapindi Karam : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో దొండకాయలు కూడా ఒకటి. దొండకాయలతో మనం వివిధ రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. దొండకాయలతో సులభంగా చేసుకోదగిన వంటకాలల్లో దొండకాయ శనగపిండి కారం కూడా ఒకటి. శనగపిండి వేసి చేసే ఈ దొండకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. సైడ్ డిష్ గా తినడానికి ఈ వేపుడు చాలా చక్కగా ఉంటుంది. వెరైటీ రుచులు కోరుకునే వారు ఇలా దొండకాయతో వేపుడును తయారు చేసుకుని తినవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ దొండకాయ శనగపిండి కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దొండకాయ శనగపిండి కారం తయారీకి కావల్సిన పదార్థాలు..
దొండకాయలు – పావుకిలో, శనగపిండి – అర కప్పు, నూనె – 3 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, శనగపప్పు మరియు మినపప్పు – ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 5, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత,కారం – 2 టీ స్పూన్స్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా -ఒక టీ స్పూన్.
దొండకాయ శనగపిండి కారం తయారీ విధానం..
ముందుగా దొండకాయలకు ఉండే చివర్లను తీసేసి నిలువుగా రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో శనగపిండి వేసి చిన్న మంటపై కలుపుతూ వేయించాలి. శనగపిండి చక్కగా వేగి కమ్మటి వాసన వచ్చిన తరువాత ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు అదే కళాయిని శుభ్రం చేసి అందులోనే నూనె వేసి వేడి చేయాలి. తరువాత జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తరువాత కరివేపాకు వేసి వేయించాలి. తరువాత దొండకాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు, పసుపు వేసి కలపాలి.
ఇప్పుడు వీటిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వేయించాలి. దొండకాయ ముక్కలు పూర్తిగా వేగిన తరువాత ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, వేయించిన శనగపిండి వేసి కలపాలి. ఈ మసాలాలన్నీ ముక్కలకు పట్టేలా చక్కగా కలుపుకుని మరో 4 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దొండకాయ శనగపిండి కారం తయారవుతుంది. దీనిని అన్నంతో తిన్నా లేదా పప్పు, సాంబార్ వంటి వాటిలోకి సైడ్ డిష్ గా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. దొండకాయలను ఇష్టపడని వారు కూడా ఈ విధంగా తయారు చేసిన కారాన్ని ఇష్టంగా తింటారు.